ఆయన ఫ్రేమ్ పెడితే.. ఎలాంటి సన్నివేశమైనా దృశ్య కావ్యమైపోతుంది. షాటు షాటుకి వైవిధ్యత.. బ్లాకు బ్లాకు కీ విశిష్టత. ఆయన కన్నుపడిన కెమేరా .. ఎన్నో అద్భుతాల్ని ఆవిష్కరిస్తుంది. పేరు ఛోటా కె నాయుడు. కానీ ఆయన పనితనానికి ముగ్ధులైన దక్షిణాది ప్రేక్షకులు జాదూ కె నాయుడు అంటారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కి ఛోటా మేనమామ అవుతారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఛోటా స్వస్థలం. చిన్నప్పటినుంచీ చదువు మీద కన్నా సినిమాల మీదే ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టేవారు. ఫలితంగా ఆయన పదవ తరగతి తోనే తన చదువుకు స్వస్తి చెప్పారు. దేవర్ ఫిల్మ్స్ యూనిట్ లో కెమేరా అప్రెంటిస్ గా తన సినీ జీవితాన్ని ఆరంభించిన ఛోటా.. ఆ తర్వాత దాసరి నారాయణరావు టీమ్ లో జాయిన్ అయ్యారు. వి.యస్. ఆర్ స్వామి దగ్గర ఎన్నో మెలకువలు నేర్చుకున్న ఛోటా.. అమ్మరాజీనామా చిత్రంతో పూర్తి స్థాయిలో ఛాయా గ్రాహకుడిగా టాలీవుడ్ లో రంగ ప్రవేశం చేశారు. ఆపై చాలా తక్కువ సమయంలోనే ఛోటా కె నాయుడు తన టాలెంట్ ను నిరూపించుకొని .. టెక్నాలజీ మీద బాగా పట్టున్న టెక్నీషియన్ గా మారారు. అంజి చిత్రానికి నంది అవార్డు అందుకున్న ఛోటా .. కొత్త బంగారు లోకం, ఢమరుకం చిత్రాలకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నారు. ఎన్నో తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు మూడు దశాబ్దాలకు పైగానే సినిమా టో గ్రాఫర్ గా సేవలందిస్తోన్న ఛోటా కె నాయుడు పుట్టిన రోజు నేడు. ఈ సందర్బంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.