ఆమె గానం వేల కోకిలల పెట్టు..ఆమె పాట తేనెజలపాతంలో మునకలేసి.. ఆమె గొంతులోంచి జాలువారినట్టు అనిపిస్తుంది. ఎలాంటి పాటకైనా మాధుర్యాన్ని అద్ది మధురిమల్ని అందించడం ఆమె లక్షణం. దాదాపు అన్ని దక్షిణాది భాషల్లోనూ పాటలు పాడి.. తనకు తానే సాటి అనిపించకున్న మేటి గాయని ఆమె. పేరు చిత్ర. సుశీలమ్మ.. జానకమ్మ.. ఆ తర్వాత.. ఇంకెవ్వరు చిత్రమ్మే! దశాబ్దాల పాటు ఆమె పాట లేని సినిమా లేదు.ఏ యుగళగీతమైనా ఆమె గళం వినిపించకుండా లేదు! పన్నెండు భాషల్లో.. పాతికవేలకు పైగా పాటలు.. ఈ లెక్క చాలు చిత్ర గాత్రం ఎంత పక్కాగా ఉంటుందో!
ఒకవైపు స్వరార్చన.. మరోవైపు సామాజిక సేవతో ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తోంది ఆమె. చిత్ర కేరళలోని తిరువనంతపురములో, సంగీతకారుల కుటుంబములో జన్మించింది. బాల్యములో ఈమె తండ్రి కృష్ణన్ నాయర్, చిత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ మలయాళ సినీ నేపథ్యగానానికి చిత్రను పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో ఈమె చెన్నైలోని తమిళ సినిమారంగములో అడుగుపెట్టింది. దక్షిణాది భాషలు, హిందీలలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. చిత్ర వేలకొద్ది సినిమా పాటలు, సినిమాయేతర పాటలు రికార్డు చేసింది. తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది. ఇన్ని పురస్కారాలు మరే ఇతర నేపథ్యగాయకురాలు అందుకోలేదు. జాతీయ పురస్కారాలు అందుకొన్నాయి కొన్ని సినిమాలు. ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 9అవార్డులు, తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు అందుకొన్నది. ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది. నేడు చిత్ర పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆ కోకిలమ్మకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.