Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘ఇంద్ర’ ఒక మర్చిలేని చిత్రం. ఈ చిత్రం చిరంజీవికి కొత్త ఇమేజ్ను తీసుకువచ్చి, ఆయన కెరీర్‌కు మరొక మలుపు తిప్పింది. ఇంతకు ముందు సీమ బ్యాక్‌డ్రాప్ స్టోరీలుంటే నటసింహ నందమూరి బాలకృష్ణకే పట్టం కట్టేవారు. కానీ ‘ఇంద్ర’తో మెగాస్టార్లో కొత్త కోణం బయటపడింది. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో భారీ వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈ రీ-రిలీజ్‌కు మెగా అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా విడుదల చేసిన వీడియోలో ‘ఇంద్ర’ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, “ఇంద్రసేన రెడ్డి అని అంటుంటే ఒళ్లు గగుర్లు పొడుస్తుంది. ఆ సినిమాకి ఉన్న పవర్ అలాంటిది. ఇంద్ర అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం ఆ సినిమా కథ. అలాగే ఆ చిత్రం కోసం పనిచేసిన వారంతా మనసు పెట్టి శ్రద్ధగా పనిచేశారు. అందుకే ఇప్పటికీ ఇంద్రకు సంబంధించి ప్రతీ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకున్నారు. ఆ చిత్రం గురించి మాట్లాడు కుంటున్నారు. ఏ సీన్ నుంచి చూడటం మొదలు పెట్టినా చివరి వరకూ చూస్తాం. అదే ఆ కథ గొప్పతనం.
నా సినిమాల్లో అత్యంత సాంకేతిక విలువలున్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కథ, కథనం, నటీనటులు నటన, పాటలు ప్రతీది అద్భుతం. సినిమాలో తీసేయడానికి అంటూ ఏదీ ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి కచ్చితమైన ఉదాహరణ. బి.గోపాల్ దీన్ని గొప్పగా తెరకెక్కించారు.” అని అన్నారు.
2002 జులై 22న విడుదలైన ‘ఇంద్ర’ ఇప్పుడు 22 సంవత్సరాల తర్వాత రీ-రిలీజ్ అవుతుండటం చిరంజీవికి ఎంతో ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తరం వాళ్లకు ‘ఇంద్ర’ని బిగ్ స్క్రీన్ మీద చూపించాలనే ఆలోచన వచ్చిన స్వప్నాదత్, ప్రియాంక దత్‌లకు అభినందనలు తెలిపారు.