Chiranjeevi : నటసింహం నందమూరి బాలకృష్ణ 50వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి.. బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన సినీ ప్రస్థానంపై ఎంతో ఆసక్తికరంగా ప్రసంగించి ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ.. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలను చేయడం ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలను చూరకొన్నారని అన్నారు. ఆయన తన తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు” అని ప్రశంసించారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండొచ్చుగానీ.. హీరోల మధ్య ఉన్న బంధాన్ని ప్రదర్శించడానికి ఈ వేడుకలు చాలా ముఖ్యమని చిరంజీవి అభిప్రాయపడ్డారు. బాలయ్య తన ఇంటికి వచ్చి, తమతో కలిసి డ్యాన్స్ చేస్తూ అనుబంధాన్ని చాటుకుంటారని చెప్పారు.
బాలయ్య 50 సంవత్సరాలుగా హీరోగా కొనసాగుతున్న విషయం చాలా గొప్ప విషయమని అన్నారు. ఆయన ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని ఆకాంక్షించారు. చిరంజీవి తన ప్రసంగంలో, సినీ పరిశ్రమలోని వారందరూ ఒక కుటుంబంలా ఉంటారని, ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు.
నిజానికి తాను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి బాలకృష్ణ నటించిన ‘సమరసింహారెడ్డి’ సినిమా ఆదర్శమని తెలిపారు. అంతేకాకుండా.. బాలయ్యతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. చిరంజీవి, బాలయ్యబాబు వంటి ఇద్దరు అగ్రనటులు ఒకే వేదికపై కలిసి వచ్చి ఒకరినొకరు ప్రశంసించుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప క్షణం. ఈ వేడుక తెలుగు సినీ ప్రేమికులందరికీ మరచిపోలేని అనుభవం.