అమాయకమైన ముఖం… ఉంగరాల జుట్టు.. నవ్వు తెప్పించే లాంగ్వేజ్ .. వెరైటీ బాడీ లాంగ్వేజ్ వెరసి చిన్నా. సహజమైన నటన.. స్పష్టమైన ఉచ్ఛారణ అతడి ప్రత్యేకతలు. తెలుగు లో 50కి పైగానే చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు చిన్నా. రామ్ గోపాల్ వర్మ శివ చిత్రంతో టాలీవుడ్ లో నటుడిగా పరిచయమైన అతడు .. ఆ సినిమాలో చిన్నాపేరుతో అత్యంత సహజంగా నటించి.. ఎవరీ నటుడు అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. చివరికి చిన్నానే తన స్ర్కీన్ నేమ్ గా మార్చుకున్నాడు.
నెల్లూరుకు చెందిన చిన్న అసలు పేరు ఆరుగుంట జితేంద్రరెడ్డి . సినిమాల మీద ఉన్న పేషన్ తో నటుడుగా రాణించాలనే అతడి కలను .. వర్మ తన ‘శివ’ చిత్రంతో నెరవేర్చాడు. ఆ సినిమాతో వచ్చిన మంచి పేరు.. ఆ తర్వాత కోడి రామకృష్ణ మధురానగరిలో, శివ నాగేశ్వరరావు ‘మనీ’ చిత్రాలతో రెట్టింపు పెరిగింది. ఆ తర్వాత మనీ మనీ , కబడ్డీ కబడ్డీ, పంతం, గౌతమ్ ఎస్.ఎస్.సీ, మీ శ్రేయోభిలాషి , చిన్నోడు, దూకుడు లాంటి చిత్రాలతో నటుడిగా సత్తా చాటుకున్నాడు. అంతేకాదు ఆ ఇంట్లో అనే హారర్ మూవీతో దర్శకుడిగా కూడా రాణించాడు. ప్రస్తుతం కొన్ని టీవీ సీరియల్స్ లో నటిస్తూ… తన కెరీర్ ను కొనసాగిస్తోన్న చిన్నా పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.