విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటించిన క్లాసిక్స్ లో ‘చెరపకురా చెడేవు’ చిత్రం ఒకటి. భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కోవెలమూడి భాస్కరరావు స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1955, జూలై 6న విడుదలైంది. సరిగ్గా నేటికి 65 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. షావుకారు జానకి కథానాయికగా నటించిన ఈ సినిమాలో రేలంగి, ఆర్.నాగేశ్వరరావు ,అమర్ నాథ్, దొరైసామి, సూర్యాకాంతం, లక్ష్మీ రాజ్యం, రాజసులోచన, పుష్పలత ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సముద్రాల జూనియర్ సంభాషణలు అందించగా.. ఘంటసాల స్వరాలు సమకూర్చారు. ఒక జమీందారుకి ఇద్దరు భార్యలు … మొదటి భార్య కొడుకు చిన్నతనంలోనే ఇంటినుంచి వెళ్లిపోతాడు. రెండో భార్య కొడుకు, అతడి భార్య తో జమీందారు ఒక పెద్ద బంగ్లాలో నివసిస్తూ ఉంటాడు. అయితే అప్పుడే ఆ ఇంట్లోకి రాహువులా ఒక వ్యక్తి ప్రవేశించి.. ఒక నకిలీ విల్లు సృష్ఠించి , అతడి కొడుకుకు ఒక డ్యాన్సర్ లో లింక్ కుదిర్చి అతడ్ని ఆ ఇంటికి దూరం చేస్తాడు. ఇంతలో ఆ జమీందారు మరణిస్తాడు. ఆస్తినంతటిని తనే కాజేయడానికి జీమీందారు మొదటి భార్య కొడుకును కూడా ఆ ఇంటికి రాకుండా చేస్తాడు. చివరికి అన్నదమ్మలు ఇద్దరూ కలుసుకొని తమ ఇంటిని ఎలా కాపాడుకున్నారు అన్నదే మిగతా కథ. విలన్ గా ఆర్.నాగేశ్వరరావు నటించగా.. జీమీందారు గా.. రావులపల్లి నటించారు. ఆయన రెండో భార్యగా సూర్యాకాంతం నటించారు. చక్కటి సెంటిమెంట్, కుటుంబ విలువలతో కూడిన ఈ సినిమా .. ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.