నిప్పులు చెరిగే కళ్ళు..  నిలువెల్లా క్రూరత్వం.. భయం గొలిపే రూపం.. భయపెట్టే వ్యక్తిత్వం.. ఇవన్నీ ఒక్క పాత్రలోనే ఉంటే .. ఆయనే చరణ్ రాజ్ . ప్రతి ఘటన సినిమాలోని కాళి పాత్రతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో భయపెట్టి.. ఉత్తమ విలన్ అనిపించుకున్నాడు ఆయన. ఆ పాత్రలో వేరెవరినీ ఊహించుకోలేనంత ఇంపాక్ట్ కలగచేసిన ఆయన .. స్వతహాగా కన్నడిగుడే అయినా..  తెలుగు ప్రేక్షకులే అత్యధికంగా ఆదరించారు. ఆయన ఇంతవరకు తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 సినిమాలలో నటించారు. హీరోకి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆయనలో ఉన్నాసరే..  విలన్ పాత్రల్లోనే బాగా  రాణించారు చరణ్ రాజ్.

కర్ణాటకలోని బెల్గాం కు చెందిన చరణ్ రాజ్  అసలు పేరు బ్రహ్మానంద. స్నేహితులు ముద్దుగా బ్రమ్మూ అని పిలిచేవారు. ఆయన తండ్రి వివిధ ప్రాంతాలనుంచి కలప తీసుకుని వచ్చి వ్యాపారం చేసేవాడు. వారికి ఓ సా మిల్లు కూడా ఉండేది. ఆయన చదువంతా స్వంత ఊరు బెల్గాంలోనే సాగింది. ఉన్నత పాఠశాల చదువు నుంచే పాఠశాలలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొనేవాడు. కొన్ని బహుమతులు కూడా గెలుచుకున్నాడు. అందరూ అతన్ని సినిమాలకు సరిపోతావని పొగుడుతున్నా గురురాజ్ భట్ అనే స్నేహితుడు మాత్రం అతన్ని సినిమాలకు పనికిరావని ఎగతాళిగా చేశాడు. దాంతో అతడితో చాలెంజ్ చేసి నాన్న వ్యాపారం కోసం దాచుకున్న కొంత సొమ్ము తీసుకుని బెంగుళూరుకు వచ్చేశాడు.  పొట్టకూటి కోసం ఓ స్టార్ హోటల్ లో రాత్రిళ్ళు పాటలు పాడేవాడు. పాటలు పాడటం అతనికి చిన్నప్పటి నుంచీ హాబీ. పగలు సినిమా అవకాశాల కోసం ప్రొడక్షన్ ఆఫీసులు, దర్శకనిర్మాతల చుట్టూ తిరిగే వాడు. కొద్ది రోజులకు ఎస్.డి. సిద్ధలింగయ్య అనే దర్శకుడు పరాజిత అనే కన్నడ సినిమా ద్వారా కథానాయకుడిగా అవకాశమిచ్చాడు. అప్పట్లో ఆ సినిమా వంద రోజులు ఆడింది. ఆ తరువాత పది సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. తరువతా తెలుగు సినిమా ప్రతిఘటన లో కాళీ అనే విలన్ పాత్ర చేశాడు. అది ఆయనకి చాలా మంచి పేరు తీసుకుని వచ్చింది. ఆయన జీవితాన్నే ఓ మలుపు తిప్పింది. ఆ సినిమా తర్వాత చరణ్ రాజ్ తెలుగులో ‘అమెరికా అబ్బాయి, అరణ్యకాండ, ఆస్తులు అంతస్థులు, స్వయం కృషి, దొంగమొగుడు, ఇంద్రుడు చంద్రుడు , కర్తవ్యం, సూర్య ఐపియస్, పోలీస్ బ్రదర్స్ , ఆశయం, గాయం, జెంటిల్ మేన్’ లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో విలన్ గా మెరిశారు. చివరగా చరణ్ రాజ్ నటించిన తెలుగు చిత్రం  కృష్ణవంశీ ‘పైసా’. నేడు చరణ్ రాజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!