ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన ప్రతిభ, ఎలాంటి సన్నివేశాన్నైనా రక్తి కట్టించగలిగిన సత్తా.. అవతల ఎలాంటి నటుడితోనైనా పోటీ పడి నటించగలిగిన ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. కళాత్మక చిత్రాలైనా.. కుటుంబ కథా చిత్రాలైనా.. కమర్షియల్ మూవీస్ అయినా.. కామెడీ సినిమాలైనా.. ఇంకెలాంటి చిత్రాలైనా ఆయనకు ఒకటే. పేరు చంద్రమోహన్. నిలువెత్తు విగ్రహం కాకపోయినా.. ఒక దశలో టాలీవుడ్ లోని అగ్రకథానాయకులతో పోటీ పడుతూ.. చిత్రాలు చేసిన టాలెంట్ ఆయనది. సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు చంద్రమోహన్. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా ఆయన ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాడు. క్రొత్త హీరోయన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపధంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. “ఈయనే కనుక ఒక అడుగు పొడుగు ఉంటే సూపర్ స్టార్ అయిఉండే వారు” అని సినీ అభిమానులు భావించేవారు.
చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు. సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, కొత్తనీరు, నాగమల్లి, అమాయకచక్రవర్తి, మూడుముళ్ళు, పెళ్ళిచూపులు, సువర్ణసుందరి, లాంటి చిత్రాలతో హిట్టు కొట్టి.. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆ కాలంలో ఆయన సరసన శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి లాంటి కథానాయికలు నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. నేడు చంద్రమోహన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.