మనిషి బతికుండగా జరిగే ఇతివృత్తాలతోనే సాధారణంగా ఏ సినిమా అయినా తెరకెక్కేది. అయితే దీనికి భిన్నంగా మనిషి పోయాకా.. అతడి తాలూక బంధాలు, అనుబంధాలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి? అతడి విలువ ఎలాంటిది? లాంటి కథలు తెరకెక్కించే దర్శకులు చాలా అరుదు. అలాంటి సినిమాలు తీసే ఓ విభిన్నమైన దర్శకుడు చంద్ర సిద్ధార్ధ. ఆ నలుగురు చిత్రం ఏ రేంజ్ లో టాలీవుడ్ లో సెన్సేషన్ అయిందో తెలిసిందే. ఆ తర్వాత శర్వానంద్ తో తీసిన ‘అందరి బంధువయా’ చిత్రం కూడా సరిగ్గా అలాంటి ఇతివృత్తంతోనే సినిమా తీశాడు చంద్ర సిద్ధార్ధ. ఆ పై సుమంత్ హీరోగా ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో చిత్రం తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా ఎందుకోగానీ.. అంతగా ఆడలేదు.
ఇక చంద్ర సిధ్ధార్ధ ఎర్లియర్ గా తీసిన ‘ఆటగదరా శివ’ చిత్రం కూడా ఇంచు మించు మనిషి చావుతో ముడిపడిన చిత్రమే. ఉరి తీసేవాడు.. ఉరిశిక్ష పడ్డవాడు..కలిసి ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలోంచి పుట్టిన కథే ఈ సినిమా. కన్నడ చిత్రం ‘రామా రామా రే’ కి రీమేక్ వెర్షన్. హైద్రాబాద్ కు చెందిన చంద్ర సిద్ధార్ధ .. తండ్రి కోరిక మేరకు ఐఏయస్ చదివి కలెక్టర్ అవుదామనుకున్నాడు. కానీ ఆయనకు సినిమాల మీద ఉన్న పేషన్ కారణంగా దర్శకుడయ్యాడు. తనకిష్టమైన కథల్ని మాత్రమే తెరకెక్కిస్తూ.. .. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరు సంపాదించారు. త్వరలోనే తన తదుపరి చిత్రంపై ప్రకటన చేయబోతున్న చంద్ర సిద్ధార్ధ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.