కవి, అష్టావధాని, హరికథా భాగవతార్, భాగవత సప్తాహ నిర్వాహకులు, రంగస్థల నటుడు, నాటకదర్శకుడు, సినీ, నాటకరచయిత, ఆయుర్వేద వైద్యుడు! అన్నింటికీ మించి గొప్ప మానవతావాది. ఇవన్నీ ఒకే మనిషిలో ఉంటే ఆయనే చందాల కేశవదాసు. తెలుగు సినిమా చూసిన మొట్టమొదటి రచయిత. తెలుగు తెరపై మొదటి సారిగా వినిపించిన సంభాషణలు, పాటలు ఆయన రాసినవే. అందుకే ఆయన్ను .. తెలుగు సినిమా వాచస్పతి అని అంటారు.
కేశవదాసు 1876 జూన్ 20 తేదీన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, జక్కేపల్లి గ్రామంలో చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి వైద్యవృత్తి చేస్తుండేవారు. దాసు చిన్నతనంలో తండ్రి వద్దే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. చిన్నప్పటి నుండే ఆయనకు సంగీతం, పాటలంటే ఎంతో మక్కువ. కేశవదాసు కృష్ణాజిల్లా తిరువూరు పట్టణానికి చెందిన కాబోలు చిట్టేమ్మను వివాహం చేసుకున్నాడు. ఆయన పలుమార్లు తిరువూరు గ్రామాన్ని సందర్శించారు. ఆయన 1911లో కనకతార, 1935లో బలిబంధనం వంటి నాటకాలు రచించారు. కనకతార నాటకంలో స్త్రీలు ఎదుర్కొనే పలు సమస్యల గురించి ఆసక్తిగా వివరించారు. ఈ నాటకం ఆరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రదర్శించబడింది. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకానికి సమానంగా అనాటి ప్రేక్షకులు కనకతార నాటకాన్ని ఆదరించారు. 1931 తొలి తెలుగు టాకీ చిత్రమైన భక్తప్రహ్లాదకు పాటలు రచించారు. పరితాప భారంబు భరింయిప తరమా అనే పాట తొలి తెలుగు గీతంగా పేరుపొందింది. ఆయన సతీసక్కుభాయి, శ్రీకృష్ణతులాభారం, సతీఅనసూయ, లంకాదహనం, కనకతార, రాధాకృష్ణ, బాలరాజు చిత్రాలకు పాటలు రాశారు. శ్రీకృష్ణతులాభారంలోని భలే మంచి చౌకబేరం అనే గీతం ఆయన రాసిందే. నాటకం ప్రారంభంలో పాడే పాటైన పరబ్రహ్మ పరమే శ్వర అనే గీతం కూడా ఆయన రచించారు. నేడు చందాల కేశవదాసు జయంతి. ఈ సందర్భంగా ఆ అక్షర వాచస్పతికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.