ఆయన రాగాలు శ్రోతల హృదయాల్ని రంజింపచేస్తాయి. ఆయన స్వరాలు రస హృదయులను తరింపచేస్తాయి. ఆయన పాటలు .. మంత్రాలై మధురిమలు చిలకరిస్తాయి. తెలుగు సినిమా సంగీత చరిత్రలో ఆయనదో మరపురాని అధ్యాయం. పేరు చక్రధర్. తెలుగుతెరపై ఆయన పెట్టుకున్న పేరు చక్రి. మొదట్లో ప్రైవేటు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌తో కెరీర్‌ని మొదలుపెట్టి,  ఆపై  సినీ సంగీతాన్ని ఆవహింపచేసుకున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాచి’ చిత్రంతో టాలీవుడ్‌ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చక్రి ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతాన్ని అందించారు. చక్రి సుమారు 85 సినిమాలకు గీతాలను సమకూర్చారు. ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్, నంది పురస్కారాలను సైతం గెలుచుకున్నారు. ఎంతోమంది ఔత్సాహిక గీత రచయితలను, గాయనీగాయకులను, టెక్నిషియన్లను టాలీవుడికి పరిచయం చేశారు.  సత్యం’ సినిమాకు ఉత్తమ గాయకుడిగా ఓ ఫిలింఫేర్‌ పురస్కారాన్ని, ‘సింహ’ చిత్రానికి ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఓ నంది పురస్కారాన్ని అందుకొన్నారు.

‘బాచి’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఆడుతూ పాడుతూ’, ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘ఇడియట్‌’, ‘అమ్మాయిలు అబ్బాయిలు’, ‘ధన లక్ష్మి ఐ లవ్‌ యు’, ‘కబడ్డీ కబడ్డీ’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘డ్రీమ్స్‌’, ‘ఒక రాజు ఒక రాణి’, ‘దొంగ రాముడు అండ్‌ పార్టీ’, ‘శివమణి’, ‘సత్యం’, ‘తొలి చూపులోనే’, ‘ఆంధ్రావాలా’, ‘పెదబాబు’, ‘143’, ‘అందరూ దొంగలే దొరికితే’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను’, ‘ధన 51’, ‘సోగ్గాడు’, ‘చక్రం’, ‘భగీరథ’, ‘పార్టీ’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘దేవదాసు’, ‘అసాధ్యుడు’, ‘భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా’, ‘సత్యభామ’, ‘దేశముదురు’, ‘ఢీ’, ‘టక్కరి’, ‘కాశీపట్నం చూడరా బాబు’, ‘కృష్ణ’, ‘నగరం’, ‘విక్టరీ’, ‘నేనింతే’, ‘మస్కా’, ‘గోపి గోపిక గోదావరి’, ‘రాజు మహారాజు’, ‘సింహ’, ‘గోలీమార్‌’, ‘ఆకాశ రామన్న’, ‘బావ’, ‘సరదాగా కాసేపు’, ‘వాంటెడ్‌’, ‘జై బోలో తెలంగాణ’, ‘నా ఇష్టం’, ‘శ్రీమన్నారాయణ’, ‘దేవరాయ’, ‘లడ్డు బాబు’, ‘రేయ్‌’, ‘యుద్ధం’, ‘ఎర్ర బస్సు’, ‘టామీ’, ‘వెన్నెల్లో హాయ్‌ హాయ్‌’ తదితర సినిమాలకు చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలోని ‘చక్రం’ సినిమాలో సిరివెన్నెల గీతం జగమంతా కుటుంబం… చక్రికి గాయకుడిగా ఎంతో పేరు తెచ్చింది. నేడు చక్రి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!