తారీఖులు దస్తావేజులు పుట్టినఊళ్లు అన్నీ పక్కన పెట్టి ఇవాళ  ఎస్.డి.లాల్ గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. లాల్ గారు…  తెలుగు సినిమా చరిత్రలో ఆయనదో స్పెషల్ పేజీ.
 ఆయన తీసినవన్నీ మాస్ సినిమాలే. నిర్మాతకు ఆర్ధిక నష్టం కలిగించకూడదు అనుకునే దర్శకుడాయన. తీసింది అంతా కలిపి నలభై సినిమాలే. అందులో అధికం అన్నగారు నందమూరి తారక రామారావుతోనే. ఎన్.టి.ఆర్ ఎస్.డి లాల్ ది సక్సస్ ఫుల్ కాంబినేషన్. ఇది ఇండస్ట్రీ మాట. అన్నగారి ఫ్యాన్స్ మాట. అందుచేత లాల్ గారి జయంతి సందర్భంగా అన్నగారితో ఆయన తీసిన సినిమాల గురించి మాట్లాడుకుందాం…
 ఎన్.టి.ఆర్ కు సన్నిహితులు, ఆయనతోనే ఎక్కువ చిత్రాలు నిర్మించిన నిర్మాత మిద్దే జగన్నాథరావు. 1967 ప్రాంతాల్లో ఆయన తీసిన నిండుమనసులు చిత్రం ఎన్టీఆర్ లాల్ కాంబినేషన్ కు అంకురార్ఫణ చేసింది.
దేవిక హీరోయిన్ గా చేసిన నిండు మనసులులో ఎన్.టి.ఆర్ గెటప్ దగ్గర నుంచి మాసీగా ఉండేలా చూసుకున్నారు లాల్.
 ఎస్.డి.లాల్ సుదీర్ఘకాలం విఠలాచార్య దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. విఠలాచార్య దగ్గర పనిచేయడం వల్లనే కావచ్చు…
తన తొలి చిత్రం కోసం జానపద కథ అపూర్వ చింతామణిని ఎంపిక చేసుకున్నారు. విఠలాచార్య దగ్గర పనిచేయడం వల్లే కావచ్చు…
ఆయనతో ఎన్.టి.ఆర్ ఎక్కువ సినిమాలు చేశారు. ప్రతి సినిమాలోనూ ఎన్.టి.ఆర్ గెటప్ నేలక్లాసును టార్గెట్ చేస్తూనే ఉండేది.
అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా నేనే మొనగాణ్ణి.
అందులో లాల్ గారు పెట్టుబడి కూడా పెట్టారు. సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది … అలాగే ఆర్ధికంగా నష్టాన్ని మిగిల్చింది కూడా.  
ఎన్.టి.ఆర్ తో ఏర్పడ్డ సాన్నిహిత్యం వల్లే కావచ్చు. లాల్ డైరక్ట్ చేసిన రామారావు సినిమాలకు మొదట్లో టి.వి.రాజు సంగీతం అందించేవారు. ఈ కాంబినేషన్ భలే మాస్టారు వరకు కొనసాగింది.
ఎన్.టి.ఆర్ కు మాస్ లో ఉన్న ఇమేజ్ కు ఏ మాత్రం భంగం కలగని పద్దతిలో లాల్ సినిమా నడక ఉండేది. ఒక రకంగా ఆ తర్వాత రోజుల్లో వచ్చిన బాపయ్య,  రాఘవేంద్రరావులకు లాల్ రోల్ మోడల్ అనుకోవచ్చు.
ఇక్కడ ఓ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సత్యచిత్ర నిర్మాతలు అడవి రాముడు సినిమా ప్రపోజల్ తో ఎన్టీార్ దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన ఔట్ డోర్ కు డేట్స్ ఇవ్వడం కుదరకపోవచ్చు అన్నారు. అలాగే ఓ సలహా చెప్పారు. వాహినీలో అడవి సెట్ వేసి తీసేయండి … ఎటూ రీమేక్ అంటున్నారు కనుక … ఎస్.డి లాల్ ను దర్శకుడుగా పెట్టుకోండి అన్నారు.
అయితే అప్పటికే నిర్మాతలు రాఘవేంద్రరావు అని అనుకోవడంతో ఎన్టీఆర్ కు సర్దిచెప్పి రెమ్యూనరేషన్ భారీగా పెంచి ఔడ్ డోర్ కు ఒప్పించారు. అలా ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ పెరగడంలో కూడా లాల్ గారి పాత్ర ఉంది.  
 ఎన్.టి.ఆర్ లాల్ కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు తీసిన నిర్మాత వై.వి.రావ్. అపరాధపరిశోధన పత్రిక నుంచి సినిమా నిర్మాణం వైపు నడిచిన వైవిరావ్ ఎన్.టి.ఆర్ తో తీసిన మొదటి సినిమా నిప్పులాంటి మనిషి. హిందీ సినిమా చరిత్రను మార్చిన జంజీర్ చిత్రానికి అనువాదం. తెలుగునాట కూడా అదిరిపోయే కలెక్షన్స్ వసూలు చేసిన అమితాబ్ మూవీని రీమేక్ చేసి అదే రేంజ్ హిట్ కొట్టడం మామూలు విషయమా?
ఆ టైమ్ కి బడిపంతులు లాంటి సినిమాలతో వయసు మళ్లిన పాత్రలకు మళ్లుతున్న ఎన్టీఆర్ ను మళ్లీ కుర్ర పాత్రలకు మళ్లించిన చిత్రాల్లో నిప్పులాంటి మనిషిది చాలా పెద్ద పాత్ర. ఇంకో విషయం ఆ రోజుల్లో తెలుగు ప్రాంతాల్లో ఎక్కడైనా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కనిపిస్తే చాలు నిప్పులాంటి మనిషి అనేవారు జనం అంత ప్రభావం వేసింది ఆ సినిమా.
:ఘంటసాల వెంకటేశ్వర్రావు కన్నుమూసిన సంవత్సరంలో వచ్చిన ఎన్.టి.ఆర్ సినిమా నిప్పులాంటి మనిషి. అప్పటికింకా ఎన్టీఆర్ కు బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ను జనం అలవాటు పడలేదు. అలాంటి టైమ్ లో వచ్చిన సినిమా నిప్పులాంటి మనిషి. ఇందులో అన్నగారికి ఒక్క పాట కూడా ఉండదు. విచిత్రంగా కారక్టర్ రోల్ చేసిన సత్యనారాయణకు మాత్రం ఓ సూపర్ హిట్ సాంగ్ వచ్చింది.
అదే  స్నేహమేరా జీవితం…స్నేహమేరా శాశ్వతం… అలా సత్యనారాయణకు కూడా కొత్త జీవితాన్ని ప్రసాదించారు లాల్ గారు. నా పేరే భగవాన్ అనే సినిమాను కూడా ఇక్కడ తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి.  
 హిందీ సినిమాలను తెలుగు నేటివిటీకి దగ్గరగా తీసుకువచ్చి నిప్పులాంటి మనిషి లాంటి సూపర్ సక్సస్ మూవీ తీసిన లాల్ ఇక వెనక్కు తిరగలేదు. ఎన్.టి.ఆర్ పర్సనల్ మేకప్ మేన్ పీతాంబరం సమర్పణలో వచ్చిన అన్నదమ్ముల అనుబంధం కూడా పెద్ద విజయమే దక్కించుకుంది.
లాల్ ఎన్.టిఆర్ ఫ్యాన్స్ కు ఆరాధ్య దర్శకుడుగా మారిన క్షణాలవి. ఇంతకీ ఈ సినిమా బాలీవుడ్ హిట్ మూవీ యాదోంకీ బారాత్ రీమేక్.
 ఎన్.టి.ఆర్ లాల్ కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ బాలీవుడ్ మూవీని రీమేక్ చేస్తే సరిపోతుందని చాలా మంది నిర్మాతలు బయల్దేరారు. ఈ లిస్ట్ లో సీనియర్ నిర్మాణ సంస్ధ రాజ్యం ప్రొడక్షన్స్ కూడా ఉండడం విశేషం. దీవార్ సినిమాను రాజ్యం ప్రొడక్షన్స్ కోసం రీమేక్ చేశారు లాల్. విచిత్రంగా ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతం అందించారు. విచిత్రంగా ఇందులోనూ ఎన్టీఆర్ కు పాటలు ఉండవు. సినిమా దీవార్ లా బిగ్గెస్ట్ హిట్టేం కాదు. ఓ మోస్తరుగా ఆడింది అని చెప్పుకోవడం కంటే ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టింది ఆ సినిమా.
 ఒకే సంవత్సరం జస్ట్ రెండు నెల్ల గ్యాప్ లో ఒకే దర్శకుడు ఒకే హీరో పనిచేసిన సినిమాలు రెండు విడుదల కావడం నిజంగా విశేషమే. ఆ రేర్ ఫీట్ చేసిన దర్శక హీరోల జంట ఎన్టీఆర్ ఎస్డీ లాలే.
1976 మే 19న మగాడు విడుదలైంది. సరిగ్గా రెండు నెల్లకు జులై 22న నేరం నాది కాదు ఆకలిది రిలీజ్ అయ్యింది.
రోటీ అనే హిందీ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన నేరం నాది కాదు ఆకలిది కూడా మంచి విజయాన్నే సాధించింది.
 ఎస్.డి లాల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వరసగా చిత్రాలు తీసిన నిర్మాత వై.వి.రావే. నిప్పులాంటి మనిషి నుంచి వరసగా ఏడాదికి ఒకటి చొప్పున ఎన్.టి.ఆర్ తో సినిమాలు చేశారు. అన్నీ రీమేక్సే.
అన్నిటికీ లాలే దర్శకుడు. నేరం నాది కాదు ఆకలిది లో ఎన్.టి.ఆర్ మీద హిట్ సాంగ్స్ ఉన్నాయి. వాటిలో పబ్లిక్ రా ఇది అన్నీ తెలిసిన పబ్లిక్ రా అనే పాట ఒకటి. కాంటెంపరరీ పాలిటిక్స్ మీద చిన్న సెటైర్ గా సాగే ఈ పాట అప్పట్లో రేడియోలో తెగ వినిపించేది.  
 1967లో ప్రారంభమైన లాల్ ఎన్.టి.ఆర్ హిట్ కాంబినేషన్ సరిగ్గా పదకొండేళ్లు కొనసాగింది. వారి కాంబినేషన్ లో 1978లో మళ్లీ వరసగా రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండింటిలోనూ ఒకటి రాజపుత్ర రహస్యం. లక్ష్మయ్య చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఆ టైమ్ లో తిరిగి మొదలైన జానపద చిత్రాల ట్రెండులో వచ్చిన సినిమా. కృష్ణ కూడా అదే సమయంలో సింహగర్జన అనే జానపదం చేశారు. ఎన్.టి.ఆర్ తో లాల్ చేసిన జానపదం రాజపుత్ర రహస్యం మాత్రం మంచి వసూళ్లే రాబట్టింది.
భారీ విజయం అయితే సాధించలేదు.
 ఎన్టీఆర్, ఎస్డీ లాల్ కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం లాయర్ విశ్వనాథ్. శత్రుఘ్నసిన్హా సూపర్ హిట్ మూవీ విశ్వనాథ్ కి ఇది రీమేక్. అప్పట్లో శత్రు ఓ ట్రెండు ఫాలో అయ్యేవాడు. జనంలో బాగా నానిన క్రికెటర్ల పేర్లు పెట్టడమే ఆ ట్రెండు. కాళీచరణ్ అప్పట్లో వెస్టిండీస్ బెస్ట్ ప్లేయర్. ఆ పేరుతో సినిమా తీశాడు శత్రు. అది హిట్ అయ్యి తెలుగులో ఖైదీకాళిదాసుగా వచ్చింది.
అలాగే విశ్వనాథ్ కూడా గండప్ప విశ్వనాథ్ పామ్ లో ఉండగా పెట్టిన టైటిలే. లాయర్ విశ్వనాథ్ సినిమాకు కూడా నిర్మాత వైవి రావే కావడం విశేషం.
లాల్ గారు ఎన్టీఆర్ తో క్రైమ్ సినిమాలు తీస్తే దాస్ గారు హీరో క్రిష్ణతో క్రైమ్ సినిమాలు తీసేవారు. అలాంటిది వారిద్దరి కెరీర్ చివరి రోజుల్లో లాల్ గారు ముగ్గురూ ముగ్గురే సినిమా తీశారు. అలాగే దాస్ గారు ఎన్టీఆర్ తో యుగంధర్ తీశారు.
ఆ తర్వాత జనరేషన్ హీరో చిరంజీవితో నకిలీమనిషి అనే డిటెక్టివ్ నవలాధారిత చిత్రం తీసి సక్సస్ కొట్టారు లాల్ గారు. మోహన్ బాబుతో షోకిల్లా రాయుడు , పటాలం పాండు లాంటి సినిమాలూ తీశారు.
నిజానికి ఆయన సాహిత్య జీవి. చలంగారి సాహిత్యం దగ్గర నుంచీ చదివిన మనిషి. వాటి గురించి మాట్లాడిన మనిషి. అయితే ఆయన తీసినవన్నీ డిష్యుం డిష్యుం సినిమాలే కనుక ఆయన ప్రపంచానికి అలానే అర్ధమయ్యారు.
స్క్రిప్టు ధశ నుంచీ ఆయన ఇచ్చే ఇన్ పుట్స్ గొప్పగా ఉపయోగపడేవి … లాల్ గారితో పనిచేయడం రచయితకు చాలా హాయిగా ఉండేది అనేవారు గొల్లపూడి మారుతీరావు.
లాల్ గారి జయంతి సందర్భంగా ఆయన సక్సస్ ఫుల్ కాంబో గురించి మాట్లాడుకోవడం బావుంటుందనే ఎన్టీఆర్ నూ తల్చుకున్నాం …

Writer – Bharadwaja Rangavajhala

Leave a comment

error: Content is protected !!