విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ .. నవ్వు పుట్టించే లాంగ్వేజ్..  డైలాగ్స్ చెప్పడంలో ఒక విధమైన విరుపు… వింతగొలిపే కంఠధ్వని.. ఆయన ప్రత్యేకతలు. ఆయన పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు . షార్ట్ కట్ లో సి.యస్.ఆర్. అదే ఆయన స్ర్కీన్ నేమ్ అయింది. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా భిన్న పాత్రల్లో పోషించి నటుడిగా తన శైలిని ప్రదర్శించారు సి.యస్.ఆర్.  పదకొండేళ్లకే రంగస్థలంపైకి అడుగుపెట్టిన ఆయనకి మెథడ్‌ యాక్టర్‌గా పేరుంది. పదాల్ని ఎక్కడ విరచాలో అక్కడ విరుస్తూ, ఒక్కొక్క సంభాషణని స్పష్టంగా పలుకతూ ఆయన నటనలో తనకి తానే సాటి అని నిరూపించుకొన్నారు.

సి.యస్.ఆర్ కు చిన్నప్పటి నుండి నాటకాల పిచ్చి ఎక్కువగా ఉండేది. రామదాసు, తుకారాం, సారంగధర వంటి ఎన్నో భిన్నమైన పాత్రలను నాటకరంగంపైనే ఆలవోకగా నటించి వాటికిజీవం పోశారు. ఆంగికం, వాచకం, అభినయం మూర్తీ భవించిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేశారు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడి‌గా విభిన్న పాత్రలకు జీవం పోసిన గొప్ప నటుడు  సీయస్సార్. ఈస్టిండియా ఫిల్మ్‌ కంపెనీ 1933లో నిర్మించిన రామదాసులో ఆయనే హీరో. ద్రౌపదీ వస్త్రాపహరణం లో శ్రీకృష్ణునిగా నటించారు. సారథీ వారి గృహప్రవేశం చిత్రం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఎల్.వి.ప్రసాద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో కామెడీ విలన్‌ పాత్రలో ఆయన నటించారు అని చెప్పే కన్నా జీవించారని చెప్పాలి. ఇక జగదేకవీరుని కథలో హే రాజన్‌ శృంగార వీరన్‌ అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు. ఇక  అప్పుచేసి పప్పుకూడు లో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. సీయస్సార్‌ నటజీవితంలో మరో మైలు రాయి మాయాబజార్‌ లోని శకుని పాత్ర. ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది వంటి డైలాగులు ఆయన నటనా ప్రతిభకు అద్ధంపడతాయి. కన్యాశుల్కం లో రామప్ప పంతులుగా, ఇల్లరికంలో మేనేజరు గా, జయం మనదేలో మతిమరుపు రాజుగా, కన్యాదానంలో పెళ్ళిళ్ల పేరయ్యగా, ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. నేడు సి.యస్.ఆర్ జయంతి. ఈ సందర్భంగా ఆ మహానటుడికి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!