ఆయన కలం .. సినీ  సాహిత్య క్షేత్రంలో అద్భుతమైన పాటల్ని పండించిన హలం.  అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులోనూ, సామాస భూయిష్టమైన పద విన్యాసాలతోనూ పాటలు రాయడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. అలతి అలతి పదాలతో అద్భుతమైన భావావేశంతో ఆయన రాసిన పాటలు కొన్ని దశాబ్దాల కాలం పాటు తెలుగు తెరను వెలిగించాయి. ఆయన పేరు సి.నారాయణ రెడ్డి.

1962లో గులేభకావళి చిత్రానికి అన్ని పాటలు రాసి చిత్రరంగ ప్రవేశం చేశారు సినారే . ఆతర్వాత ఆయన కలం వెనుతిరిగి చూడలేదు. ఆత్మబంధువు, కర్ణ, లక్షాధికారి, అమరశిల్పిజక్కన్న, రాముడు భీముడు, కోడలు దిద్దిన కాపురం… ఇలా రెండు దశాబ్దాలు వెండితెరను పాటల రచయితగా ఏలారు. ఏకవీర చిత్రానికి మాటలు కూడా అందించారు. స్వాతి ముత్యంలో లాలిలాలి వటపత్ర శాయికి వరహాల లాలి అని జోలపాట పాడారు, వరనకట్నం చిత్రంలో వరకట్నాన్ని వ్యతిరేకిస్తూ- ఇదేనా మన సంప్రదాయమిదేనా… అని ప్రశ్నించారు. అమరశిల్పి జక్కన్నలో ఈ నల్లనిరాళ్లలో ఏ కన్నులు దాగెనో అని రాళ్లకున్న మనసును వెలికితీశారు. రేపటి పౌరులు చిత్రంలో రేపటి పౌరులం రేపటి పౌరులం అని విద్యార్థుల భావి జీవితానికి మార్గాన్ని నిర్మించారు. ఒసే రాములమ్మలో ముత్యాలరెమ్మ… అంటూ తన కలంలో వాడివేడి తగ్గలేదని నిరూపించుకున్నారు. 2009లో అరుంధతిలో జేజేమ్మా పాట ఆ చిత్రవిజయానికి ముఖ్యభూమికైంది.  ప్రేమించు చిత్రంలోని కంటేనే అమ్మంటే ఎలా…, సీతయ్య చిత్రంలోని ఇదిగొ రాయలసీమగడ్డ పాటలకు నంది అవార్డులు సైతం వీరికి వచ్చాయి. వీరు రాసిన పాటల గురించి వీరే ఓ పత్రికలో పాటలో ఏముంది నామాటలో ఏముంది అనే శీర్షికను నిర్వహించారు. అది నేడు పుస్తకంగా కూడా లభ్యమవుతోంది. ఇక సాహితీ, విద్యావేత్తగా వీరికొచ్చిన  అవార్డులకు లెక్కే లేదు. 1997లో పద్మశ్రీ 1978లో కళాప్రపూర్ణ, 1988లో రామలక్ష్మీ, 1992లో పద్మభూషణ్… ఇలాంటివన్నీ నారాయణరెడ్డి ప్రతిభకు కొలమానాలు. 1989లో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్  వీరి విశ్వంభర కావ్యానికి వచ్చిది. 1997లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. నేడు సి.నారాయణ రెడ్డి జయంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!