C. Ashwanidath : వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వనీదత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి 2898 ఎ.డి” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే . 27వ తేదీన విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, ముంబై, చెన్నై, బెంగళూరు సహా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన స్పందన అందుకుంటోంది.
తొలి రోజున ఏకంగా రికార్డు స్థాయిలో 191 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా.. నిర్మాత సి. అశ్వనీదత్ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు. తన మొదటి సినిమా నుండి నాగ్ పనితీరును నమ్ముతున్నానని చెప్పారు. అలాగే అమితాబ్ బచ్చన్ వేదికపై తనకు చేసిన నమస్కారం మరువలేనిదని అన్నారు.
ఈ సినిమా విజయంతో రెండవ భాగం గురించి కూడా నిర్మాత సంకేతాలు ఇచ్చారు. కమల్ హాసన్ ఈ సినిమాలో చేసేసరికి రెండవ భాగం నిర్ణయించుకున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మధ్యలో రెండవ భాగం విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. చివరిగా నిర్మాత ఈ సినిమా విజయానికి కారకులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ తో పాటు సాంకేతిక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వచ్చే సినిమాలలో కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.