సినిమా గురించి కలలు కన్నాడు. దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టాడు. అడపాదడపా గొంతు సవరించుకున్నాడు. దర్శకుడవ్వాలనుకున్నాడు. హీరో అయ్యాడు. నటనలో మెలకువలు నేర్చుకున్నాడు. వైవిధ్యమైన పాత్రల్ని ఎన్నుకున్నాడు. విలక్షణ నటుడు అనిపించుకున్నాడు. అతడే సిద్ధార్ధ సూర్య నారాయణ్. స్ర్కీన్ నేమ్ సిద్ధార్ధ. బాయ్స్ సినిమాతో దక్షిణాదిన హీరోగా అడుగుపెట్టాడు. ఆపై   టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో ‘బొమ్మరిల్లు’ కట్టుకున్నాడు. నువ్వొస్తానంటే వద్దాంటానా, ఆట, బావ, ఓయ్ , కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రాలతో విజయాలు సాధించి.. అటు తమిళంలోనూ , ఇటు హిందీ,  మలయాళ భాషల్లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సిద్దార్ధ సూర్యనారాయణ్‌ చెన్నయ్‌లో 1979 ఏప్రిల్‌ 17న తమిళ్‌ కుటుంబంలో పుట్టాడు. చెన్నయ్‌లోని దేవ్‌ బాయిస్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్లో ప్రాధమిక విద్య పూర్తి చేసిన సిద్దార్ధ న్యూ ఢిల్లీ సర్దార్‌ పటేల్‌ విద్యాలయలో పై చదువులు చదివాడు. న్యూ ఢిల్లీలోని కిరోరి మాల్‌ కాలేజీలో బి.కామ్‌ చదివిన తర్వాత ముంబయ్‌లోని ఎస్పీ జైన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనెజ్మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ద్వారా ఎంబీఏ చదివాడు. కాలేజీలో ఉండగానే కళా రంగం పట్ల ఇష్టంతో అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకుని తన సృజనకు మెరుగులద్దాడు. చదువు పూర్తి కాగానే తన తండ్రి స్నేహితుడు యాడ్‌ డైరెక్టర్‌ జయేంద్రతో పాటు సినిమాటోగ్రాఫర్‌ పీసి శ్రీరామ్‌ సహకారంతో 2001లో మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా చేరిపోయాడు. ఆ సంవత్సరమంతా అదే మణిరత్నం దగ్గరే శిష్యరికం చేసాడు. అంతే కాదు… మణిరత్నం సినిమా అయిన ‘కణ్ణత్తిల్‌ ముత్తమితాల్‌’లో అసలు గుర్తింపునకు నోచుకోని బస్‌ ప్రయాణికుడి పాత్రను కొద్దినిముషాలపాటు పోషించాడు. అక్కడ నుంచి హీరోగా తన ప్రస్థానం ప్రారంభించి.. ఇప్పుడు సౌత్ లోనే విలక్షణ హీరో గా ముద్ర వేసుకున్నాడు. సిద్దార్థ్‌ ఖాతాలో ఇంటర్నేషనల్‌ తమిళ్‌ ఫిల్మ్‌ అవార్డ్స్, ఫిలింఫేర్‌ అవార్డ్స్, స్క్రీన్‌ అవార్డు, నార్వే తమిళ్‌ ఫిల్మ్‌ అవార్డు, ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్, తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు ఉన్నాయి. నేడు సిద్ధార్ధ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ బొమ్మరిల్లు బాయ్ కి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే సిద్ధార్ధ.

 

 

Leave a comment

error: Content is protected !!