Bollywood : మాస్ మహారాజా రవితేజ హీరోగా.. బాలీవుడ్ ‘రైడ్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అవడం.. తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. అయితే, హిందీలో ‘రైడ్’ సినిమాకు సీక్వెల్ ప్రకటించడంతో ఈ చర్చ మరింత రసవత్తరమైంది.

బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘రైడ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది. అక్కినేని నాగార్జున వరకు ఈ ప్రాజెక్టును చేయాలని అనుకున్నారు. కానీ, వివిధ కారణాల వల్ల ఆ ప్రయత్నం ఫలించలేదు. అయితే, గత ఏడాది రవితేజ హీరోగా ఈ రీమేక్ ఖరారైంది. ‘దబంగ్’, ‘జిగర్ తండ’ వంటి సినిమాలను విజయవంతంగా తెలుగులో రీమేక్ చేసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

హరీష్ శంకర్ కెరీర్‌లో ఇప్పటివరకు అన్ని సినిమాలు హిట్టే కావడంతో ‘మిస్టర్ బచ్చన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. రవితేజ కెరీర్‌లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ ఫలితం రవితేజ, హరీష్ శంకర్‌లతో పాటు నిర్మాతలకు కూడా పెద్ద షాక్‌.

ఇదిలా ఉండగా, హిందీలో ‘రైడ్’ సినిమాకు సీక్వెల్ ప్రకటించడం విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ‘రైడ్-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ అనౌన్స్‌మెంట్ రాగానే తెలుగు నెటిజన్లు ‘మిస్టర్ బచ్చన్’ టీం మీద కౌంటర్లు మొదలుపెట్టారు. ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్ల టైంలో రవితేజ, హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘రైడ్’ హీరో అజయ్ దేవగణ్ అండ్ టీం ‘మిస్టర్ బచ్చన్’ చూశారంటే ‘ఆహ్’ అని ఆశ్చర్యపోయి మళ్లీ దీన్ని వాళ్లు రీమేక్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను తీసుకొచ్చి పోస్ట్ చేస్తూ వాళ్లు రీమేక్ చేస్తున్నది ‘మిస్టర్ బచ్చన్’ నే కావచ్చు అంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.

సినీ రంగంలో రీమేక్‌లు అనేవి సాధారణం. కానీ, ప్రతి రీమేక్ హిట్ అవుతుందని చెప్పలేం. ఒక సినిమా ఒక భాషలో హిట్ అయిందని మరో భాషలో కూడా హిట్ అవుతుందనే గ్యారంటీ లేదు. ‘మిస్టర్ బచ్చన్’ విషయంలో జరిగింది ఇదే. ఈ సంఘటన తెలుగు సినీ పరిశ్రమకు ఒక పాఠం. రీమేక్ చేసే ముందు ఆ సినిమా కథ, కథనం, ప్రేక్షకుల రుచి వంటి అంశాలను బాగా అర్థం చేసుకోవాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Leave a comment

error: Content is protected !!