కల్తీ లేని కథ.. స్వచ్ఛమైన హాస్యం.. సరదా గొలిపే సన్నివేశాలు .. అడుగడుగునా వినోదంలో ముంచితేల్చే స్ర్కీన్ ప్లే .. ఆయన సినిమాల గొప్పతనం. అసభ్యతకు ఎలాంటి తావు ఇవ్వకుండా.. మన సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి.. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎన్నో వినోదాత్మకమైన చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు ఆయన. 1990, 2000 దశకాల్లో ఆయన తీసిన చిత్రాలు సంచలనం సృష్టించాయి. యేడాదిపాటు ఆడిన చిత్రాలున్నాయి. ఆయన పేరు యస్వీ కృష్ణారెడ్డి. తీయగ సాగే రాగంలో.. హాయిని గొలిపే పాటల్ని కంపోజ్ చేయడంలో కూడా ఆయన మాస్టర్. ఎక్కువగా తన సినిమాలకు తనే సంగీతం సమకూర్చి.. ఆ విద్యలో కూడా ఆరితేరారు ఆయన.
తూర్పుగోదావరి జిల్లా కొంకుదురు గ్రామానికి చెందిన యస్వీ కృష్ణారెడ్డి హీరో అవ్వాలనే ఉద్దేశంతో మద్రాస్ లో కాలుమోపారు. అవకాశాల కోసం కాళ్ళరిగేలా తిరిగి . చివరికి విసిగిపోయి.. తానే ఒక సినిమా నిర్మించాలనే నిర్ణయానికొచ్చారు. సినిమా పేరు పగడాల పడవ. ఆ సినిమా లో కృష్ణా రెడ్డి హీరో. కానీ మధ్యలోనే ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్ని లాభసాటి వ్యాపారాలు చేసి.. ఆ తర్వాత అచ్చిరెడ్డితో కలిసి కొబ్బరి బొండాం సినిమా నిర్మించారు. ఆధునిక సినీ చరిత్రలో నిర్మాత అచ్చిరెడ్డి- దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మిత్ర ద్వయం మనీషా ఫిలిమ్స్ పతాకం మీద ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలు నిర్మించి పేరు గడించారు. ఈ సంస్థ నిర్మించిన చిత్రాల వెనుక కృష్ణారెడ్డి అవిరళ కృషి, అసామాన్య ప్రతిభ దాగి ఉన్నాయి. అలాగే కృష్ణారెడ్డి వేసిన ప్రతి అడుగు వెనకే అచ్చిరెడ్డి, కిశోర్ రాఠీలు నడిచి ఆయనకు సహకారం, ఆత్మబలం చేకూర్చారు. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ చిత్రంతో దర్శకుడిగా మారిన యస్వీ కృష్ణారెడ్డి… ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు, మావిచిగురు, శుభ లగ్నం , ఆహ్వానం , సర్దుకుపోదాం రండి, ప్రేమకు వేళాయెరా లాంటి ఎన్నో విజయవంతమై చిత్రాలు తీసి .. ఫ్యామిలీ చిత్రాలు తీయడంలో మాస్టర్ అనిపించుకున్నారు. ఇక ఆహ్వానం చిత్రాన్ని ఇంగ్లీష్ లో ‘డైవోర్స్ ఇన్విటేషన్’ అనే పేరుతో రీమేక్ చేశారు. తానే హీరోగా ఉగాది, అభిషేకం అనే రెండు చిత్రాలు తెరకెక్కించారు. నేడు యస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.