గాడ్ ఫాదర్స్ లేరు. బ్యాక్ అప్ ఎవరూ లేరు. అయినా సరే సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఒంటరిగా ఎదుర్కొని హీరోగా నిలబడ్డాడు ఆయన. పేరు శ్రీకాంత్. స్వయం కృషితో పైకొచ్చిన హీరోలిస్ట్ లో ఆయన పేరు కూడా చేరిపోయింది. మేకా శ్రీకాంత్ అని పిలిపించుకొనే ఆయన.. శతాధిక చిత్రాల్ని పూర్తి చేసిన హీరోల లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు. తన కెరీర్ మొత్తం లో 125 సినిమాలు పూర్తి చేసిన శ్రీకాంత్ .. నిర్మాతగా కూడా అభిరుచి చాటుకున్నారు.
శ్రీకాంత్ తనో బూరెబుగ్గల బుల్లోడు. చేపకళ్ళ చిన్నోడు. మనసున్న మంచోడు. ‘తాజ్ మహల్’ సినిమాతో అమ్మాయిల కలల రాకుమారుడిగా అలరించిన అందగాడు. ‘పెళ్ల్లిసందడి’ సినిమా విజయంతో ప్రతిఇంటా బంధువయ్యాడు. ‘ఖడ్గం’లా ఎప్పటికప్పుడు తనలోని నటుడుకి పదును పెడుతూ… 100వ సినిమాగా చేసిన ‘మహాత్మ’తో నటుడుగా మెప్పించి అభిమానుల మన్ననలు పొందాడు. తన పుట్టినరోజు సందర్భంగా కెరీర్ లో సాధించిన కొన్ని అరుదైన విషయాలను గుర్తుచేసుకుందాం.
శ్రీకాంత్ 1968 మార్చి 23న కర్ణాటక రాష్ట్రంలోని కొప్పల్ జిల్లా గంగావతిలో జన్మించాడు. కర్నాటక విశ్వవిద్యాలయంలో బికామ్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూసి నటుడు కావాలనే కోరిక కలిగి ఎలాగైనా ఆయన్ను కలవాలని… ఇలా ఎన్నో కలలను ఊహించుకునేవాడు. ఆ ప్యాషన్ తోనే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో చేరి డిప్లమా పొందాడు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్ కౌంటర్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్.. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించారు. అయితే తాజ్ మహల్ చిత్రంతో ఆయన హీరోగా మారి.. అప్పట్లో చాలా తక్కువ పోటీనెదుర్కొని హీరోగా స్థిరపడ్డారు.
ఆయన ఇమేజ్ పాతికేళ్ల కింద ఓ రేంజ్ లో ఉండేది. ఏడాదికి అరడజను సినిమాలు చేసేవాడు. 90లలో సినిమాల వాల్ పోస్టర్స్ చూస్తే 10 సినిమాలలో 5 సినిమాలు తను హీరోగా చేసిన సినిమాలు ఉండేవి. అంతలా బిజీ హీరోగా ఉండేవాడు. ఇప్పటికి ఒకవైపు అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు శ్రీకాంత్.
శ్రీకాంత్ ఇండస్ట్రీకి తర్వాత అవకాశాలు కోసం చాలానే కష్టపడ్డాడు. తనకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోలేదు. అక్కడి నుంచి చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటూ… ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ సినిమాతో తొలిసారి స్క్రీన్ మీద కనిపించాడు శ్రీకాంత్. ఆ సినిమాకి ఐదు వేల రూపాయల పారితోషికం అందుకున్నాడు.
శ్రీకాంత్ కెరీర్ మొదట్లో ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’, ‘అబ్బాయిగారు’, ‘వారసుడు’ లాంటి చాలా సినిమాల్లో నెగిటివ్ షేడ్ పాత్రలో నటించాడు. తొలిసారిగా ‘వన్ బై టు’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ సినిమా మంచి తనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రామానాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’ ఆ వెంటనే వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందడి’ ఆ రెండు సినిమాల విజయంతో శ్రీకాంత్ ఇక వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘వినోదం’, ‘ఎగిరే పావురమా’, ‘ఆహ్వానం’, ‘మా నాన్నకి పెళ్లి’, ‘కన్యాదానం’, ‘ప్రేయసి రావే’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలతో శ్రీకాంత్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.
చిరు ప్రోత్సహం…
అలా విజయాలతో సాగుతున్న తన కెరీర్ లో అపజయాలు పలకరించడం మొదలు పెట్టాయి. చేసిన సినిమాలు ఆడక పోవడంతో తీవ్ర మనస్తాపంకి గురైనాడు. ఆ సమయంలో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ చిన్ననాటి నుంచి కూడా మీ సినిమాలు చూసి హీరో అవ్వాలని ఇన్స్పైర్ అయ్యాడు. ఇప్పుడు పరాజయాలు పలకరించడంతో మనస్తాపంగా ఉన్నాడని చెప్పారు. అలా శ్రీకాంత్ తనకు అభిమాని అనే విషయం తెలుసుకున్న చిరంజీవి శ్రీకాంత్ ను ఉత్తేజ పరుస్తూ సినిమా రంగంలో జయాపజయాలు సర్వసాధారణం. విజయం వచ్చిన పరాజయం వచ్చిన నిలకడగా ఉంటూ ముందుకు సాగితేనే ఇండస్ట్రీలో రాణించగలం అని చెప్పారు. ఆ ప్రోత్సాహంతో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో చేసిన ‘ఆమె’ సినిమాతో కెరీర్ పుంజుకోవటమే కాక ఆ సినిమా హీరొయిన్ ‘ఊహ’ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ముందు నుండి చిరంజీవికి వీరాభిమాని అయిన శ్రీకాంత్ ఆతర్వాత కూడా తన అభిమానంతో చిరుకి మరింత చేరువై శ్రీకాంత్ అంటే చిరు తమ్ముడు అనేలా సానిహిత్యం పొందాడు. చిరంజీవి తనకు పవన్ కల్యాణ్ ఎంతో శ్రీకాంత్ కూడా అంతే అని చాలా సార్లు చెప్పాడంటే మెగాస్టార్ పై శ్రీకాంత్ కు ఉన్న ప్రేమ, అభిమానం ఎంత గొప్పదో అర్ధం అయిపోతుంది.
శ్రీకాంత్ ఇన్నేళ్ల కెరీర్లో 125 సినిమాలు చేశాడు. తన ఖాతాలో ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘చాలా బాగుంది’, ‘దేవుళ్ళు’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘ఖడ్గం’, ‘ఆపరేషన్ దుర్యోధన’ లాంటి విజయవంతమైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. శ్రీకాంత్ 100వ సినిమాగా కృష్ణ వంశీ దర్శకత్వంలో చేసిన ‘మహాత్మ’ నటుడుగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
ఇండస్ట్రీకి కొత్తగా పరిచయమవుతున్న యువ హీరోల ధాటికి హీరోగా మార్కెట్ లేదనే విషయాన్ని గ్రహించిన మరుక్షణం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. హీరోగా ఉన్న సమయంలో కూడా ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’, ‘సంక్రాంతి’, ‘శ్రీరామరాజ్యం’ లాంటి సినిమాలలో… కెరీర్ స్టార్టింగ్ దశలో నాగార్జున తో ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’, ‘వారసుడు’ సినిమాలో నెగటివ్ షేడ్ చేసిన ‘చంద్రలేఖ’ సినిమాలో నాగార్జున శ్రీకాంత్ అభిమానిగా కనిపించడం విశేషం. అలా చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించాడు. ‘ సరైనోడు ‘ , ‘ గోవిందుడు అందరివాడేలే ‘ సినిమాల్లో అల్లు అర్జున్ బాబాయ్ గాను అలరించాడు.
ఊహను పెళ్ళాడిన శ్రీకాంత్ కు ముగ్గురు పిల్లలు కాగా తన పెద్ద కుమారుడు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’ సినిమాతో ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు తనకి ఎంతో విజయాన్నిఇచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాతో త్వరలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాబోతున్నాడు.
సినిమా రంగాన్నే నమ్ముకున్న శ్రీకాంత్ తను చేసే సినిమా విజయాలతో పాటు తన వారసుని విజయాలను కూడా చూసి ఎంజాయ్ చేస్తూ అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది మూవీ వాల్యూం.