ఆయన పాట గోదారిలా గలగలా పారుతుంది. ఆ భావం గాల్లో తేలినట్టుందే అనిపిస్తుంది. బొమ్మని గీస్తే నీలా ఉంది.. దగ్గరకొస్తే ఓ మద్దిమ్మంది.. అంటూ ఊరిస్తుంది. చూపించండే.. చూపించండే అంటూ రెచ్చగొడుతుంది. ఇంకా ఇలాంటి యూత్ ఫుల్ సాంగ్స్ ఎన్నో అవలీలగా రాసిపడేశాడు ఆయన. అలతి అలతి పదాలతో అందమైన పాట కూర్చడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. సాధారణంగా మనం మాట్లాడుకొనే పదాలనే ఏరుకొచ్చి.. మాలగా గుచ్చి.. వాటిని పాటకి అలంకరించడం ఆయనకే చెల్లింది. పేరు భాస్కరభట్ల రవికుమార్. ఆయన ఇండస్ట్రీకొచ్చి అప్పుడే 20 ఏళ్ళు అయిపోయింది. అయిన్పటికీ ఆయన పాట ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటోంది.
బాలకృష్ణ, ఇవివి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గొప్పింటి అల్లుడు’ చిత్రంతో టాలీవుడ్ లో గీతరచయితగా ప్రవేశించారు భాస్కరభట్ల. ఇప్పటి వరకు వెయ్యి పాటలకుపైగానే రాశారు. అందులో ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. రవికుమార్ శ్రీకాకుళం జిల్లాలో ఓ సాధారణ కుటుంబంలో పుట్టారు. తర్వాత పాత్రికేయుడిగా పనిచేశారుచిక్కోలునుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. గార మండలం బూరవెల్లి గ్రామములో తన తాత ఆరవెల్లి కన్నరాజ గోపాలచార్యుల వద్ద నేర్చుకున్న సాహిత్య ప్రక్రియలతో మొదలైన ఆసక్తి గేయ రచయితగా ఎదిగేందుకు దోహదపడింది. ఎలాంటి సన్నివేశానికైనా సందర్భానుసారం పాటకట్టడం ఆయన స్టైల్. ఎలాంటి ట్యూన్ కైనా తన పాటతో ట్యూన్ అయిపోవడం ఆయన నైజం. అందుకే ఆయన ఇరువై ఏళ్ళపాటు ఇండస్ట్రీలో నెగ్గుకొస్తున్నారు. ఈ సందర్భంగా భాస్కరభట్లకి అభినందనలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.