పల్లె సీమ.. పచ్చని పొలాలు.. మట్టిపరిమళం.. కల్మషం లేని మనుషులు.. కల్లా కపటం తెలియని మనసులు.. గ్రామీణ సౌందర్యం.. ఆ దర్శకుడి కథా వస్తువులు. తన సినిమా కథలన్నిటినీ ఆయన అక్కడినుంచే సృష్టించారు. ఆ కథల్లో జీవం ఉంది. ఆ కథల్లోని వ్యధల్లో ప్రాణముంది. తొలి చిత్రం నుంచి ఇప్పటి వరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ చాలా వరకూ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కడం విశేషం. పల్లె వాసుల భావోద్వేగేల్ని … చక్కటి చిత్రాలుగా మలిచిన ఆ దర్శకుడి పేరు భారతిరాజా.

భారతిరాజా తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన అళ్ళినగరంలో జన్మించారు. చిన్నప్పటినుంచీ నాటకాలంటే ఆయన మహా పిచ్చి. ఒక పక్క చదువుకుంటూ, మరో పక్క నాటకాలు ఆడుతూ.. తన మెయిన్ టార్గెట్ సినిమాగా ఫిక్సయ్యారు. చదువు పూర్తయ్యాకా తన రాసుకొన్న కథలు పట్టుకొని చెన్నై బైలుదేరారు. దర్శకుడిగా మారాలనే ఆయన కోరికకు తగ్గట్టుగానే ఆయన ప్రముఖ కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కణ్ గళ్ దగ్గర సహాయకుడిగా చేరారు. ఆ తర్వాత పి.పుల్లయ్య, యమ్. కృష్ణన్ నాయర్ లాంటి దిగ్దర్శకుల వద్ద చేశారు. ‘పదినారు వయదునిలే’ (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రంతో భారతిరాజా దర్శకుడిగా మారారు. తొలి చిత్రం తోనే సెన్సేషన్ సృష్టించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘కిళక్కు పోగుమ్ రైల్’ (తెలుగులో తూర్పువెళ్లే రైలు),సిగప్పురోజాగళ్ (ఎర్రగులాబీలుగా డబ్బింగ్ అయింది), నిళల్ గళ్ , అలైగళ్ ఒయివిదవిల్లై (తెలుగులో సీతాకోకచిలుక), మణ్ వాసనై (తెలుగులో మంగమ్మగారి మనవడు), ముదల్ మరియాదై (ఆత్మబంధువుగా డబ్బింగ్ అయింది), పుదియ వార్పుగళ్ (తెలుగులో కొత్త జీవితాలు), ఒరు ఖైదీవిన్ డైరీ (ఖైదీవేటగా డబ్బింగ్ అయింది), కడలోర కవితైగళ్ (తెలుగులో చిరంజీవి ఆరాధన), కాదల్ ఓవియమ్ (తెలుగులో రాగమాలిక గా డబ్బింగ్ అయింది), ఆయ్త ఎళుత్తు (తెలుగులో యువగా డబ్బింగ్ అయింది)   లాంటి చిత్రాలతో తమిళనాట క్రియేటివ్ జీనియస్ గా కీర్తి గడించారు. ఆయన సినిమాలకు .. మాస్ట్రో ఇళయరాజా సంగీతం తోడవడంతో.. భారతిరాజా చిత్రాలన్నీ సంగీత దృశ్యకావ్యా లైపోయాయి. ఇక భారతిరాజా  ఆరు నేషనల్ అవార్డ్స్ , నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ , రెండు తమిళనాడు ప్రభుత్వ అవార్డ్స్, ఒక నంది అవార్డ్  అందుకొన్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారం తో సత్కరించింది. నేడు భారతిరాజా పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆ క్రియేటివ్ జీనియస్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!