Bharateeyudu @ 28 : లోకనాయకుడు కమల్ హాసన్, తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్. రత్నం నిర్మాణంలో తెరకెక్కించిన అద్భుత తమిళ చిత్రం ఇండియన్. దీన్ని తెలుగులో భారతీయుడుగా అనువదించారు. 1996 మే 9న విడుదలైన ఈ రెండు వెర్షన్స్ సౌత్ ఇండియా బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపాయి. కమల్ హాసన్ అద్భుత నటనకు తెలుగు ప్రేక్షకులూ జేజేలు పలికారు. తండ్రీ, కొడుకులుగా కమల్ హాసన్ వేరియేషన్స్ ప్రేక్షకుల్ని అబ్బుర పరిచాయి. ఏఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి.
నిజానికి ‘ఇండియన్’ మూవీ స్టోరీ ఐడియా… ఒక ఓల్డ్ తమిళ సినిమా నుంచి ఎంచుకున్నదే. శివాజీ గణేశన్ నటించిన ఆ సినిమా తంగపతాకం. దేశ ద్రోహి అయిన తన కన్న కొడుకును ఒక పోలీస్ ఆఫీసర్ కడతేరుస్తాడు. అప్పట్లో ఈ సినిమా తమిళ నాట సూపర్ హిట్టయింది. ఇదే సినిమా తెలుగులో ‘బంగారు పతాకం’ గా అనువాదమైంది.
భారతీయుడులో కూడా అదే పాయింట్ వర్కవుట్ అయింది. స్వాతంత్ర్య సమరయోధుడైన సేనాపతి.. లంచగొండితనానికి తన బలైన తన కూతురి చావుకు.. ప్రతీకారం తీర్చుకుంటాడు. ఆ ప్రయత్నంలో లంచం తీసుకున్న కన్న కొడుకును కూడా సేనాపతి మట్టుబెడతాడు. మంచి కథకు తోడు.. కమల్ హాసన్ ఉపయోగించే ప్రాచీన యుద్ధ కళ .. మర్మ విద్య సినిమాకే హైలైట్ గా నిలిచిపోయింది.
మళ్లీ చాన్నాళ్ళకు ఈ సినిమాకి సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ సినిమాలో కూడా కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సిద్ధార్ధ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. జూన్ లో రిలీజ్ కాబోయే ఇండియన్ 2 మూవీ తెలుగులో భారతీయుడు 2 గా రిలీజ్ కాబోతోంది.