టాలీవుడ్ లో ఒకప్పటి యాక్షన్ హీరో సుమన్ .. కెరీర్ లో ది బెస్ట్ అనిపించుకున్న చిత్రం ‘బావ బావమరిది’. శరత్ దర్శకత్వంలో 1993 లో వచ్చిన ఈ సినిమా కు మరో ప్రత్యేక ఆకర్షణ రెబల్ స్టార్ కృష్ణంరాజు. బావ బావమరుదులుగా నటించిన వీరిద్దరి పెర్ఫార్మెన్స్ సినిమా ఘన విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. చిన్నతనంలోనే తల్లిని పొగొట్టుకున్న హీరో రాజు తన అక్కనే అమ్మగా భావిస్తాడు. ఆమెకు పెళ్లవుతుంది. పుట్టింటికి వెళుతూ వెళుతూ ఆ అక్క తన తమ్ముణ్ణి కూడా వెంట తీసుకు వెళుతుంది. అక్కడ నుంచి తన అక్కను దేవతగానూ, బావను దైవంగానూ భావిస్తాడు రాజు. వారి కూతురు తన మామయ్య మీద మనసు పడుతుంది. ఇంతలో ఆ కుటుంబానికి ఒక అనుకోని ఆపత్తు సంభవిస్తుంది. రాజు అక్క, బావ ఎడమొగం పెడమొగం అవుతారు. చివరికి రాజు ఆ సమస్యను పరిష్కరించి.. తన అక్కను, బావను ఎలా కలుపుతాడు అనేదే సినిమా కథ. అక్కగా జయసుధ, కథానాయికగా మాలా శ్రీ నటించారు. రాజ్ కోటి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమా 1992 లో తమిళంలో ప్రభు హీరోగా నటించిన ‘పాండిదురై’ చిత్రానికి రీమేక్ వెర్షన్. రాధా రవి ప్రధాన పాత్రను పోషించిన ఈ సినిమాలో కథానాయిక ఖుష్బూ. ఆ తర్వాత కాలంలో ఇదే సినిమా కన్నడలో బావ బామైదా గానూ, హిందీలో సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో బంధన్ గానూ రీమేక్ అయి ఆయా భాషల్లోనూ ఘన విజయం సాధించింది.