నటకిరీటి రాజేంద్రప్రసాద్ సినీ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రం బామ్మమాట బంగారుబాట. ఏవీయమ్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో యం.శరవణన్, యం. బాలసుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ కామెడీ చిత్రం 1989, మార్చ్ 9న విడుదలై ఘనవిజయం సాధించింది. గౌతమి కథానాయికగా నటించగా.. భానుమతి, నూతన్ ప్రసాద్ జంటగా మంచి కామెడీ పండించారు. పద్మనాభం, రాళ్ళపల్లి,సుత్తివేలు, బ్రహ్మానందం, సాక్షిరంగారావు, ఆనందరాజ్, సిల్క్ స్మిత ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. చిన్నతనంలో తల్లిదండ్రుల్ని కోల్పోయి నానమ్మ దగ్గరే పెరిగిన కృష్ణ అనుకోకుండా సీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవల్సి వస్తుంది. దాంతో కోపం వచ్చిన బామ్మ  కృష్ణని, సీతను ఇంటినుంచి గెంటేస్తుంది. అయితే తనకు కొడుకుపుట్టాడని తాతతో అబద్ధమాడిన కృష్ణ..నానమ్మ ను ప్రసన్నం చేసుకోడానికి లేని కొడుకును తీసుకొచ్చి బామ్మకు చూపిస్తాడు. అప్పుడు జరిగే పరిణామాలు చిత్ర కథను మలుపుతిప్పుతాయి. ఆద్యంతం నవ్వులతో ముంచెత్తిన ఈ సినిమా సూపర్ హిట్టైనా సరే… నటుడు నూతన్ ప్రసాద్ కెరీర్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది. ఇందులో ఒక సన్నివేశం కోసం జరిగిన చిత్రీకరణలో ఆయన రెండు కాళ్ళూ దెబ్బతిని.. ఆయన చనిపోయేంతవరకూ వీల్ చెయిర్ కే పరిమితమయ్యారు. నిజానికి ఈ సినిమా 1988 లో తమిళంలో వచ్చిన ‘పాట్టి సొల్లై తట్టాదే’ చిత్రానికి రీమేక్ వెర్షన్. పాండ్యరాజన్, ఊర్వశి, మనోరమ, యస్.యస్ .చంద్రన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని రాజశేఖరే డైరెక్ట్ చేశారు.

Leave a comment

error: Content is protected !!