ఆయన కన్ను పడితే చాలు.. మామూలు దృశ్యం సైతం దృశ్యకావ్యంగా మారిపోతుంది. వ్యూ ఫైండర్ లో ఒక కన్నుమూసి మరో కంటితో ఆవలనున్న దృశ్యాన్ని సెల్యులాయిడ్ పై కళాత్మకంగా మార్చడంలో ఆయన ఆరితేరిన వాడు. ఎలాంటి వాతావరణాన్నైనా క్షణంలో సృష్టించగల ఛాయా బ్రహ్మ ఆయన. పేరు బాలూ మహేంద్ర. కొన్నిదశాబ్దాల కాలంపాటు తన కెమెరాతో దక్షిణాది తెరమీద మహేంద్రజాలం సృష్టించాడు ఆయన.
శ్రీలంక లోని తమిళ ఫ్యామిలీలో జన్మించారు బాలూ మహేంద్ర. విద్యాభ్యాసంకూడా అక్కడే పూర్తి చేసారు. 13 ఏళ్ల వయసులో డేవిడ్ లీన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్’ చిత్రం చూసే అవకాశం దక్కించుకున్న బాలు మహేంద్ర తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. లండన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ డిగ్రీ పట్టా పొందిన అనంతరం పూణె లోని ఎఫ్‌టిఐఐలో జాయినై సినిమాటోగ్రఫీలో కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించారు. మొదట ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్ర సీమలో ప్రవేశించారు. అనంతరం ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో చిత్రాలను రూపొందించారు. దక్షిణాదిలోని అన్ని భాషలలో రూపొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు. సొమ్మొకడిది సోకొకడిది, తరం మారింది, లంబాడోళ్ల రాందాసు, మనవూరి పాండవులు, శంకరాభరణం తదితర చిత్రాలకు ఆయన ఛాయగ్రాహాకుడిగా పనిచేశారు. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. భానుచందర్, అర్చన జంటగా నటించిన నిరీక్షణ చిత్రానికి, కమల్ హాసన్ – శ్రీదేవి జంటగా నటించిన మూండ్రామ్ పిరై (వసంతకోకిల) చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే సినిమా హిందీలో సద్మా పేరుతో వచ్చింది. అలాగే ఇంకా రెండు తోకల పిట్ట, చక్రవ్యూహం, సతీ లీలావతి లాంటి మరికొన్ని చిత్రాల్ని డైరెక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. బాలూ మహేంద్ర రెండు నంది అవార్డ్స్, ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తోపాటు, కేంద్ర ప్రభుత్వ, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. నేడు బాలూమహేంద్ర జయంతి. ఈ సందర్భంగా ఆ మహేంద్రజాలికుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.