ఆయన మాటలు తూటాలు.. డైలాగులు డైనమైట్లు .. కంటి చూపుల్ని కత్తులుగా చేసి ప్రత్యర్ధుల మీదకు దూసే ‘నరసింహనాయుడు’. తనఎదుట తొడగొట్టిన వాడ్ని తన మాటల గొడ్డలితో తెగనరికే ‘సమరసింహారెడ్డి’. వాడి వేడి చూపులతో పంజా విసిరే సీమ సింహం. తెలుగు తెరపై నటసింహం. పేరు నందమూరి బాలకృష్ణ. తండ్రి యన్టీఆర్ నటవారసత్వాన్ని, ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ .. అభిమానుల అండదండలు మెండు నిండుగా పొందిన లెజెండ్ . సాంఘిక చిత్రాలు పక్కన పెడితే.. ఇప్పటి తరం లో కూడా జానపద, చారిత్రక , పౌరాణిక చిత్రాలు చేయగలగడం ఒక్క బాలయ్య కు మాత్రమే చెల్లింది.
1974లో ‘తాతమ్మకల’తో తెరపైకొచ్చిన బాలకృష్ణ, తన 44యేళ్ల నట జీవితంలో మరపురాని చిత్రాలెన్నో చేశారు. ఒక పక్క మాస్ కథానాయకుడిగా అభిమానుల్ని అలరిస్తూనే, నటుడిగా స్ఫూర్తిదాయకమైన పాత్రల్లో నటించారు. ‘భైరవద్వీపం’లో ఆయన నటనకి కొలమానం లేదంటే అతిశయోక్తి కాదు. గత పదేళ్ల కాలాన్నే తీసుకొంటే… ‘పాండురంగడు’గా భక్తిపారవశ్యంతో అలరించిన ఆయనే, ‘సింహా’గా మాస్ అవతారాన్ని ప్రదర్శించారు. ‘లెజెండ్’ ఆయనే, ‘డిక్టేటర్’ ఆయనే. వందో చిత్రంగా చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో చారిత్ర అంటే మనదే అని నిరూపించారు. అందులో బాలకృష్ణ చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రస్తుతం తన తండ్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్’లో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించి మెప్పించారు. తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ చిత్రంతోనే బాలకృష్ణ నిర్మాతగా మారారు. తన తనయుడు మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే బాలకృష్ణ 104వ చిత్రం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’గా తెరపైకి వచ్చింది. నటుడిగానే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. నేడు బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ నటసింహానికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్డ్ డే బాలయ్య..