మనుషులు బల్లులుగానూ, బల్లులు పిల్లులుగానూ, పిల్లులు కుక్కలుగానూ, కుక్కలు నక్కలుగానూ మారిపోవడం నిజజీవితంలో ఎక్కడా జరగదేమో గానీ.. ఆయన తలుచుకుంటే వెండితెరమీద ఒక్క క్షణం పని. గజకర్ణ, గోకర్ణ, టక్కు,టమార గారడీ విద్యలన్నీ ఆయనకు ఫ్రేముతో పెట్టిన విద్య . గ్రాఫిక్స్ ఏమీ లేని కాలంలోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు విజువల్ గా విస్మయం కలిగించిన దర్శకుడు. జానపద చిత్రాలకు తెలుగులో దిశా నిర్దేశం చేసిన దర్శకుడు. కథలో లాజిక్కులూ అవీ అవసరం లేకుండా.. ఆ రోజుల్లోనే మ్యాజిక్ చేసిన వెండితెర మాంత్రికుడు ఆయన. పేరు బి. విఠలాచార్య.

తెలుగు , తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 70 చిత్రాల్ని రూపొందించిన విఠలాచార్య కర్నాటకలోని ఉడిపిలో జన్మించారు. సర్కస్ కంపెనీలో కొంతకాలం జంతువుల ఆలన, పాలన చూసేవారు. 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వము వహించారు విఠలాచార్య. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశారు. అందులో  15 చిత్రాలు యన్టీఆర్  నటించినవే కావడం విశేషం. వాటిలో  5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించారు. నిజానికి యన్టీఆర్ , కాంతారావులిద్దరికీ మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టినవి విఠలాచార్య జానపద చిత్రాలే. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ఎలా పొందాలనే సూత్రం బాగా తెలిసిన వారవడం  వల్లనే విఠలా చార్య అన్ని జానపద చిత్రాలు తీయగలిగారు. ఒకే పెద్ద మందిరం సెట్టు వేస్తే, దాన్నే రకరకాల సెట్లుగా మార్చేవారు ఆయన. అంత:పురం రాజుగారి రహస్యమందిరం, విలన్‌ ఇల్లూ, ఇంకొక రాజుగారి ఇల్లూ – అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడిపోయేవి. సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకీ ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య విశ్వసించేవారు. అలాగే కాస్ట్యూమ్స్‌, ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అవసరం లేదు ముఖ్యపాత్రకి తప్ప. నటీనటుల కాల్‌ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లింది. టెక్నికల్ గా అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే టెక్నిషియన్ గా  ఎంతో అభివృద్ధి చూపించిన ఆ మహా దర్శకుడి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ జానపద బ్రహ్మకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Director B. Vittalacharya Top 15 Telugu Movies || Movie Volume |

Leave a comment

error: Content is protected !!