నటనకు భాషతో పనిలేదు. నటించడానికి ఏ భాషా అడ్డంకికాదు. అందుకేనేమో దాదాపు 11 భాషల్లో నటించి మెప్పించాడు ఆయన. అది కూడా విలన్ పాత్రల్లో. అన్నిభాషల్లోనూ దుష్ట పాత్రధారిగా ముద్రపడ్డాడు. విలక్షణమైన విలనిజానికి పెట్టింది పేరుగా నిలిచాడు. ఆయన పేరు ఆశిష్ విద్యార్ది. నిత్యం నటనలో మెళకువలు తెలుసుకుంటూ. .. ఇంకా విద్యార్ధిగానే కొనసాగుతున్నారు.

ఆశిష్‌ విద్యార్థి కేరళలోని తలశేరిలో జన్మించారు. ఆయన తండ్రి గోవింద్‌ విద్యార్థి నాటక రంగానికి చెందినవారు. తల్లి రెబా. ఆమె బెంగాలీ. ఆశిష్‌ దిల్లీలో చదువుకొన్నారు. చిన్నప్పుడు నాటకాలపై మక్కువ పెంచుకొన్నారు. ఆ తర్వాత టెలివిజన్‌ రంగంలోకి అడుగుపెట్టారు. కన్నడలో చేసిన ‘ఆనంద్‌’ ఆయనకి తొలి చిత్రం. 1991లో సురేష్‌గోపితో కలిసి ‘హైజాక్‌’ అనే చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత హిందీలో అవకాశాలొచ్చాయి. అయితే అక్కడ లభించే పాత్రలతో సంతృప్తి చెందని ఆయన దక్షిణాదిలోకి అడుగుపెట్టారు. ముఖ్యంగా ఆయన తెలుగు, తమిళం భాషల్లో ఎక్కువ చిత్రాలు చేశారు. కొన్ని చిత్రాల్లో ప్రతినాయక పాత్రలు, మరికొన్ని చిత్రాల్లో హాస్య ప్రధానమైన పాత్రలూ చేసి మెప్పించారు. 1995లో హిందీలో చేసిన ‘ద్రోహ్‌కాల్‌’ చిత్రంతో ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు ఆశిష్‌ విద్యార్థి. తెలుగులో ‘శ్రీరామ్‌’, ‘వందేమాతరం’, ‘అతనొక్కడే’, ‘పోకిరి’, ‘గుడుంబా శంకర్‌’, ‘అలా మొదలైంది’, ‘అతిథి’, ‘చిరుత’, ‘తులసి’, ‘లక్ష్యం’, ‘మిణుగురులు’, ‘కెవ్వు కేక’, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘ఆగడు’, ‘నాన్నకు ప్రేమతో’ తదితర చిత్రాలు ఆశిష్‌ విద్యార్థికి మంచి పేరు తీసుకొచ్చాయి. నేడు ఆశిష్ విద్యార్ధి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ విలక్షణ నటుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!