అల్లు అర్జున్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిన సినిమా ‘ఆర్య’. సినిమా విడుదలై నేటికి ఇరవై ఏళ్ళు పూర్తయ్యాయి. 2004, మే 7న విడుదలైన  ఈ సినిమా… దర్శకుడు సుకుమార్ సినీ కెరీర్ ను మార్చే ఒక బ్లాక్ బస్టర్ అయ్యింది. నిర్మాత దిల్ రాజు కెరీర్ లో మరో మెట్టు ఎక్కించింది. ఈ చిత్రంతోనే అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ మొదలై…. ఇప్పటికీ కొనసాగుతోంది.

కొత్తదనం, ప్రేక్షకులకు నచ్చేలా కథ చెప్పడంలో సుకుమార్ దిట్ట. ‘ఆర్య’ లో ఒన్ సైడ్ లవ్ అనే అంశాన్ని ఎంతో అందంగా చూపించాడు. బన్నీని ఇప్పటివరకు ఎవ్వరూ చూడని విధంగా కొత్తగా ప్రెజెంట్ చేసి, సినిమా స్క్రీన్ ప్లే తో మాయ చేశాడు. ఆర్య, గీతా పాత్రలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాడు.

దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్. ప్రతి పాటా హిట్ అయ్యింది. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ‘ఆర్య’ తో మొదలైన సుకుమార్, దేవిశ్రీప్రసాద్ ల బంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. తొలిరోజుల్లో దిల్‌రాజుకి నిర్మాతగా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం ‘ఆర్య’.

‘ఆర్య’ తెలుగులోనే కాకుండా, మలయాళం, హిందీ, తమిళం భాషల్లో కూడా విజయం సాధించింది. మలయాళీ ప్రేక్షకులు ఈ సినిమాతో అల్లు అర్జున్ ను బాగా ఆదరించారు. హిందీలో ‘ఆర్య కీ ప్రేమ్ ప్రతిగ్య’ పేరుతో డబ్ అయ్యింది. తమిళంలో ‘కుట్టీ’ పేరుతో ధనుష్ హీరోగా రీమేక్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘ఆర్య 2’ కూడా వచ్చింది.

 

Leave a comment

error: Content is protected !!