చిత్రం : అర‌ణ్య

నటీనటులు : రానా ద‌గ్గుబాటి, విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌, శ్రియా పింగోల్కర్, ర‌వి కాలే, ర‌ఘుబాబు తదితరులు

నిర్మాణ సంస్థ : ఈరోస్ ఇంట‌ర్నేష‌నల్‌‌

సంగీతం : శాంత‌ను మొయిత్రా

ఎడిటింగ్‌ : భువ‌న్ శ్రీనివాసన్

ఛాయా గ్రహణం : ఎ.ఆర్.అశోక్ కుమార్

నిర్మాణం : ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌‌

కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : ప్రభు సాల్మన్మాన్

విడుదల తేది : 26-03-2021

రానా ద‌గ్గుబాటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శకుడు ప్రభు సాల్మన్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం ‘అర‌ణ్య’. సినిమాకి ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ నిర్మాణం. సినిమా ట్రైలర్స్ లో చూపించినట్లు రానా అడ‌వి మ‌నిషిగా నటించిన లుక్, న‌ట‌న‌, ఏనుగుల‌తో చేసిన స‌న్నివేశాలు ఆస‌క్తిని కలిగించాయి. మ‌రి ఈ ‘అరణ్య’ సినిమా చూసిన ప్రేక్షకులకు ఎంటువంటి అనుభూతిని కలిగించిందనేది రివ్యూలో చూద్దాం…

క‌థ‌ :

న‌రేంద్ర భూప‌తి(రానా) అడ‌విలో నివసిస్తూ అక్కడి మ‌నుషుల‌తో  పాటు  జంతువుల‌ కూడా తోడుగా ఉంటాడు. ఎప్పుడు అడవులలో ఉంటూ మూగజీవాలతో నివసించడం చేత న‌రేంద్రను అందరూ ‘అర‌ణ్య’ అని పిలుస్తుంటారు. న‌రేంద్ర ల‌క్షకు పైగా మొక్కలు నాటి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డును రాష్ట్రప‌తి చేతుల మీదుగా అందుకున్న వన్య జీవి. తన పూర్వీకులు వారి ఆధీనంలో ఉన్న ఐదు వంద‌ల ఎక‌రాల అడ‌విని ప్రభుత్వానికి ఇచ్చేస్తారు. న‌రేంద్ర అట‌వీ శాఖా మంత్రి రాజ‌గోపాలం(అనంత్ మ‌హ‌దేవ‌న్‌) అర‌వై ఎక‌రాల అట‌వీ ప్రాంతంలో ఓ టౌన్ షిప్ నిర్మించాల‌నుకుంటాడు. అలా టౌన్‌షిప్ నిర్మాణం జరిగితే  నీళ్ళు తాగేందుకు వెళ్ళే ఏనుగుల‌ రాకపోకలకు ఇబ్బంది క‌లుగుతుంద‌ని కారణంచే అర‌ణ్య టౌన్‌షిప్ నిర్మాణానికి ఒప్పుకోడు. దాంతో మినిస్టర్ త‌న పొలిటిక‌ల్ ప‌వ‌ర్‌ను ఉప‌యోగించి అర‌ణ్యను ఇబ్బంది పెడ‌తాడు. అప్పుడు అర‌ణ్య ఏం చేశాడు? ఆ టౌన్‌షిప్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలేంటి? చివ‌ర‌కు అర‌ణ్య ఎలా గెలిచాడు?  అనే విష‌యాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

కథ విశ్లేష‌ణ‌ :

మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథే ‘అరణ్య’ సినిమా.

కథ బాగున్నా.. తెరపై చూపించిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. బలమైన కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు కొంచెం తడబడ్డాడు . పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా.. అడవి జంతువుల కోసం అరణ్య పోరాడుతున్న విధానం ఆకట్టుకునేలా చూపించలేకపోయాడు. ఇందులో కొన్ని సన్నివేశాలు అసంపూర్ణంగా ఉంటాయి. ముఖ్యంగా కథలోకి నక్సలైట్లను ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాదు. నక్సలైట్ల ట్రాక్ కి సరైన ఎండింగ్ లేదు.  అలాగే మహిళా మావోయిస్ట్‌తో సింగ ప్రేమను కూడా అంత ఆసక్తికరంగా అనిపించదు.  కథలో ఎలాంటి ట్విస్టులు కూడా ఉండవు. ఏనుగులకు రానాకు మధ్య వచ్చిన ఎమోషనల్‌ సీన్లు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్, ఏనుగులు రానా ని తప్పుగా అర్థం చేసుకొని వెంబడించే సీన్స్ చాల ఎమోషనల్ గా ఉంటాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

మొదటినుండి విభిన్నమైన పాత్రలు ఎంపిక చేసుకునే చేసే రానా ‘అర‌ణ్య’ పాత్ర కోసం పడిన కష్టం సినిమాలో కనపడుతుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫార్మేట్‌కు దూరంగా ఉన్న ‘అర‌ణ్య’లాంటి సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నందుకు ముందు త‌న‌ను అభినందించాలి. సినిమా మొత్తం కూడా అరణ్య క్యారెక్టర్లో చూపించిన మేన‌రిజాన్ని కంటిన్యూ చేశాడు.  మిగత నటులు వారి పాత్రల మేరా నటించారు. ఐతే రఘుబాబు కామెడీ మాత్రం పెద్ద గా పండలేదు 

ఇక వనమాలి పాటల్లాగే ఈ మూవీ కి ఆయన రాసిన మాటలు కూడా బాగున్నాయి.  అడవి నేపథ్యంగా సాగే ఈ సినిమాకి ప్రధాన బలం ఒకటి విజువల్‌ ఎఫెక్ట్స్‌,  మరొకటి సినిమా నేపథ్య సంగీతం. సినిమాటోగ్రఫీ ఏఆర్ అశోక్ కుమార్ కష్టం ప్రతీ ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.  ఎక్కువ శాతం షూటింగ్‌ని అడవి ప్రాంతంలోనే జరిపారు. అడవి అందాలని తెరపై చక్కగా చూపించారు. అడవిలో ఉన్నామనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. సినిమా నేపథ్య సంగీతం మరో ప్రధాన బలం శాంతను మొయిత్రా నేపథ్య సంగీతం అదిరిపోయింది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. రసూల్ పూకుట్టి చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. ఎడిటర్‌ భువన్ శ్రీనివాసన్ చాలా చోట్ల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి.

ప్రేమఖైదీ’, ‘గజరాజు’వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడంతో ‘అరణ్య’పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను దర్శకుడు అందుకోలేకపోయాడు. ఓవరాల్ గా సినిమా పర్వాలేదనిపిస్తుంది.

చివరిగా : అరణ్య’ మెసేజ్ , రానా యాక్టింగ్  మాత్రమే బాగున్నాయి 

రేటింగ్ : 3/5

 

 

Leave a comment

error: Content is protected !!