విశ్వవిఖ్యత నటసార్వభౌమ డా.యన్టీఆర్ కెరీర్ లో ఒక ప్రత్యేకమైన చిత్రం అన్నదమ్ముల అనుబంధం. గజలక్ష్మి చిత్ర బ్యానర్ పై యస్.డీ.లాల్ దర్శకత్వంలో యన్టీఆర్ పెర్సనల్ మేకప్ మేన్ ఎమ్ .పీతాంబరం నిర్మించిన ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ .. 1975, జూలై 4న విడుదలై.. తెలుగు నాట ఘన విజయం సాధించింది. నేటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి చెప్పుకోదగ్గ విశేషాలే ఉన్నాయి. ఇందులో యన్టీఆర్, మురళీమోహన్,బాలకృష్ణ అన్నదమ్ములుగా నటించడం ఓ విశేషమైతే… బాలయ్య సరసన జయమాలిని కథానాయికగా నటించడం మరో విశేషం. చిన్నతనంలో తన తండ్రిని చంపి.. తన కుటుంబం చిన్నాభిన్నం చేసినవారిపై పగ తీర్చుకోడమే కాకుండా.. తన తమ్ముళ్ళని, తల్లిని తిరిగి కలుసుకుంటాడు కథానాయకుడు. చక్రవర్తి సంగీత సారధ్యంలో ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే.., గులాబీ పువ్వై నవ్వాలి వయసు.., ఆనాడు తొలిసారి., అందమైన పిల్ల లాంటి పాటలు ఇప్పటికీ అభిమానుల్ని ఎంతగానో అలరిస్తుంటాయి. లత కథానాయికగా నటించగా.. ప్రభాకరరెడ్డి, గిరిబాబు, ఏవీయమ్ రాజన్, రాజనాల, రాజబాబు, రావికొండలరావు, త్యాగరాజు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా బాలీవుడ్ లో ధర్మేంద్ర, విజయ్ అరోరా, తారీఖ్ ఖాన్ ,జీనత్ అమన్ నటించిన ‘యాదోంకీ బారాత్ చిత్రానికి రీమేక్ వెర్షన్ . ఆ తర్వాత ఇదే సినిమా తమిళంలో యం.జీ.ఆర్ హీరోగా నాళై నమదే గానూ, మలయాళంలో ప్రేమ్ నజీర్ హీరోగా హిమం గానూ రీమేక్ చేశారు . ఆయా భాషల్లోనూ సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.