అందమైన ముఖం.. చక్రాల్లాంటి కళ్ళు.. ఆకర్షించే శరీర సౌష్టవం..ఆకట్టుకొనే అభినయం వెరసి అంకిత. టాలీవుడ్ లో నటించింది చాలా తక్కువ సినిమాలే అయినా.. తన గ్లామర్ తో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది ఆ చిన్నది. రస్నా బేబీగా పేరొందిన అంకితా ఝవేరీ చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కథానాయికగా ఈమె మొదటి చిత్రం వై.వి.ఎస్.చౌదరి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తరువాత ఈమె సింహాద్రి లాంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది. అయితే కొత్త కథానాయకిల వెల్లువలో ఈమెకూ అవకాశాలు తగ్గటంతో ప్రస్తుతం చిన్న చిన్న పాత్రలకు పరిమితం అయింది..
అంకిత ముంబాయిలో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి గుజరాతీ, తల్లి పంజాబీ. తండ్రి వజ్రాల వ్యాపారి. దక్షిణ ముంబాయికి చెందిన ఈమె కుటుంబం అంకిత సినిమాలలో ప్రవేశించడానికి బాగా ప్రోత్సహించారు. ముంబాయిలోని హెచ్.ఆర్.కళాశాలలో బీ.కాం పూర్తి చేసిన అంకిత మూడేళ్ల వయసులో రస్నా వ్యాపార ప్రకటనలో నటించి రస్నాబేబీగా ప్రసిద్ధి చెందింది. రస్నా ప్రకటన తర్వాత అంకిత వీడియోకాన్ తదితర అనేక వ్యాపార ప్రకటనలలో నటించింది. 2002లో వై.వి.చౌదరి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా కోసం హీరోయిన్ను వెతకడానికి ముంబాయి వెళ్ళినప్పుడు అంకిత ఫోటోలు చూసి, ఆమె రస్నా బేబీ రూపం నచ్చడంతో ఆ సినిమాలో కథానాయకిగా అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా విజయవంతమవ్వటంతో తెలుగులో వెనువెంటనే అనేక సినిమా అవకాశాలు వచ్చాయి. లాహిరి లాహిరి లాహిరిలో తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ సినిమాలో అంకిత నటనకు మన్ననలు పొందింది. దాంతో జూనియర్ ఎన్టీయార్ సరసర సింహాద్రిలో నటించే అవకాశం వచ్చింది. సింహాద్రి విజయవంతమవటంతో అంకితకు అనేక సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. తెలుగులో అంకిత ఆఖరి చిత్రం అనసూయ. సినిమాల మధ్యలో వచ్చిన ఖాళీ సమయంలో ఆర్నెల్ల పాటు లండన్ వెళ్ళి అక్కడ సినీ దర్శకత్వంలో డిప్లొమా పొంది తిరిగివచ్చింది. నేడు అంకిత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ రస్నాబేబీకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే అంకిత.