చక్రాల్లాంటి కళ్ళు.. చంద్రబింబం లాంటి ముఖం..  ఆకట్టుకొనే కనుముక్కు తీరు.. ఆకర్షించే కట్టు బొట్టు.. పదహారణాల ఆ  తెలుగమ్మాయి పేరు  అంజలి. అందానికి తగ్గ అభినయం. అభినయానికి తగ్గట్టుగానే ఆమె ప్రవర్తన. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆ సుందరి… ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పై దృష్టి సారించింది.

అంజలి తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు లో  జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది.  మ్యాథ్స్ లో డిగ్రీ చేస్తూనే షార్ట్ ఫిల్మ్స్ లో నటించేది. అవే అంజలికి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులుగా మారాయి. అలా తొలుత జీవా సరసన తమిళంలో ఒక సినిమాలో నటించింది. అదే తెలుగులో వచ్చిన ‘డేర్’. ఆ తర్వాత 2006లో ‘ఫొటో’ సినిమాతో స్వప్నగా అందరికీ పరిచయమైంది. 2007లో ‘ప్రేమలేఖ రాశా’.. సినిమాలో సంధ్యగా కనిపించినా తగిన గుర్తింపు దక్కలేదు. కానీ తర్వాత నటించిన ‘షాపింగ్‌మాల్’ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచింది. అది చూసిన డైరెక్టర్ మురుగదాస్ ‘జర్నీ’లో అవకాశం ఇచ్చారు. 2011లో విడుదలైన ‘జర్నీ’ సినిమాలో తన అభినయ ప్రతిభ అందరికీ తెలిసేలా చక్కటి హావభావాలు పలికించింది. మధుమతిగా డామినేటింగ్ క్యారెక్టర్‌తో అందరికీ గుర్తుండిపోయింది. ఆపై .. 2013లో మళ్లీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో సీతగా, మనింట్లో అమ్మాయిలా కనిపించి మురిపించింది అంజలి. అమాయకంగా కనిపిస్తూనే, కల్లాకపటం ఎరుగని, చిలిపి అమ్మాయిలా కనిపించిన అంజలి నటనకు  అందరూ ముగ్ధులయ్యారు.   ఆ తర్వాత ‘బలుపు’ సినిమాలో శృతిహాసన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని, రవితేజతో ఆడిపాడింది. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. సింగం-2 తమిళ వెర్షన్‌లో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చింది అంజలి. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా ముందుకు సాగిపోతోంది. నేడు అంజలి పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్  డే  అంజలి …

Leave a comment

error: Content is protected !!