చిత్రం : యానిమల్
విడుదల తేదీ : డిసెంబర్ 1, 2023
నటీనటులు : రణబీర్ కపూర్, రష్మికా మందన్న, అనిల్ కపూర్, సురేశ్ ఒబెరాయ్, సౌరభ్ సచ్ దేవ, అహ్మద్ ఇబిన్ ఉమర్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, తృప్తి దిమ్రి తదితరులు.
సంగీతం : హర్ష వర్ధన్ రామేశ్వర్
నిర్మాణం : టీసిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీవన్ స్టూడియోస్
కథ, స్ర్కీన్ ప్లే డైరెక్షన్ : సందీప్ రెడ్డి వంగా
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా.. అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా తీసి అదే రేంజ్ సక్సెస్ సాధించాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాగా.. రణబీర్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘యానిమల్’. రిలీజ్ కు ముందే టీజర్ అండ్ ట్రైలర్స్ తో .. అంచనాలు భారీగా పెంచేసిన ఈ సినిమా ఈ రోజే వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ను ఏ మేరకు అందుకుందో.. రివ్యూలో తెలుసుకుందాం…
కథ
స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) పంజాబీ ఫ్యామిలీకి చెందినవాడు. మల్టీ మిలియనీర్. పిల్లలకు తన ప్రేమను పంచలేనంత బిజీ ఆయన. కానీ కొడుకు విజయ్ కు చిన్నప్పటి నుంచి ఆయనంటే ప్రాణం. పెరుగుతున్న వయసుతో పాటు తండ్రి మీద అంతకంతకు ప్రేమను పెంచుకున్న అతడు.. తన ఆవేశం కారణంగా తండ్రి ఆగ్రహానికి గురై అమెరికా వెళ్ళిపోతాడు. ఇండియా వచ్చినప్పుడు తన ఫ్రెండ్ చెల్లెల్ని ప్రేమించి ఆమెనే పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే తన తండ్రి మీద అటాక్ జరిగిందని తెలుసుకుంటాడు. ప్రాణానికి ప్రాణమైన తన తండ్రిని ఎవరు చంపాల నుకున్నారు? వాళ్ళను ఎలా కనిపెట్టాడు? చివరికి తన తండ్రిని కాపాడు కున్నాడా లేదా అన్నది మిగతా కథ.
విశ్లేషణ
డైరెక్టర్ సందీప్ రెడ్డికి ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి నుంచి ఒక రకమైన టేస్ట్ కనిపిస్తుంది. హీరో పాత్రలో ఎక్స్ట్రీమ్ బోల్డ్ నెస్ ఉంటుంది. ఏపనైనా ఓపెన్ గా చేస్తాడు. ప్రేమను పంచే విషయంలో అయినా, దాంపత్యం విషయంలో అయినా. హీరో, హీరోయిన్స్ మధ్య ఓవర్ ఇంటిమసీని బిల్డ్ చేస్తాడు. అది చాలా సార్లు అడల్ట్ కంటెంట్ లా అనిపిస్తుంటుంది. యానిమల్ మూవీలో అది మరింత ఎక్కువైంది. అలాంటి సన్నివేశాలు సినిమా మొత్తం కనిపిస్తాయి. అయితే అవి డైలాగ్స్ లోనే ఉండేలా జాగ్రత్తపడ్డాడు.
తండ్రి కొడుకుల మధ్య ప్రేమానురాగాలు, ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలొచ్చాయి. కానీ యానిమల్ లో ఆ నేపథ్యం చాలా కొత్తగా అనిపిస్తుంది. మితిమీరిన ప్రేమ.. మనిషిని యానిమల్ గా మారుస్తుందని సందీప్ రెడ్డి చెప్పాలనుకున్నాడు. అందుకే రణబీర్ పాత్ర సినిమా మొత్తంగా అలాగే బిహేవ్ చేస్తుంది. మొండితనం, ముక్కు సూటితనం వల్ల ఎన్నోసార్లు తండ్రి ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. అయినా సరే .. తండ్రి మీద ప్రేమతో ఆయన్ను చంపాలనుకున్నవారిని అసలు క్షమించకూడదనుకుంటాడు. తనలోని మృగాన్ని బైటికి తీస్తాడు. యానిమల్ సినిమాకి ఇదే కోర్ పాయింట్.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ వావ్ అనిపించే సీన్స్ ఎన్నో ఉన్నాయి. టీనేజ్ లో ఉండగా.. తన అక్కని ర్యాగింగ్ చేసిన వారిపై అటాక్ చేసే సీన్ అయితే సినిమాకే హైలైట్. ఇంక ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ సీన్. ఈ మధ్యకాలంలో ఆ తరహా ఇంట్రవెల్ షాకింగ్ సీన్ రాలేదనే చెప్పాలి. ఈ సీన్ తోనే టీజర్ ను కట్ చేసి వదిలారు. అప్పుడే సినిమాపై అందరిలోనూ మంచి ఆసక్తి కలిగింది. అలాగే క్లైమాక్స్ ఫైట్ సీన్ కూడా ఎక్స్ ట్రార్డినరీగా పిక్చరైజ్ చేశారు.
యానిమల్ సినిమాకి రణబీర్ కపూర్ ఒన్ మేన్ షో నే హైలైట్ గా నిలుస్తుంది. టీనేజ్ లోనూ, యుక్త వయసులో ఉన్నప్పుడు, ప్రెజెంట్ పాత్రల్లో ఎంతో వేరియేషన్స్ ను చూపించాడు. అదే పాత్రతో కామెడీని కూడా అద్భుతంగా పండించాడు. అలాగే.. ఆ పాత్రలో ఎమోషన్స్ ను కూడా పీక్స్ లో పండించాడు. హీరోయిన్ రష్మికా మందన్న కు యానిమల్ మూవీ కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది. ఒక సీన్ లో అయితే ఆమె యాక్టింగ్ అద్భుతం అనిపిస్తుంది. ఇక అనిల్ కపూర్ విషయానికొస్తే.. బల్బీర్ సింగ్ పాత్ర లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో అదరగొట్టాడు. కొన్ని సీన్స్ లో కళ్ళతోనే డైలాగ్స్ చెబుతాడు. విలన్ గా నటించిన బాడీ డియోల్ మూగవాడు అయినా.. తనలోని క్రూయాలిటీని బాగా పలికించాడు. ఇంకా ఇందులో పంజాబీ యువకులుగా నటించిన వారు కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తానికి యానిమల్ సినిమా తండ్రీ కొడుకుల ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన న్యూ జెన్ యాక్షన్ మూవీ అని చెప్పాలి. అయితే ఈ సినిమాను ఫ్యామిలీతో చూస్తే ఇబ్బంది అనిపించొచ్చు.

రేటింగ్ : 3.5

Leave a comment

error: Content is protected !!