ఆయన సెట్లోకి అడుగుపెడితే.. అందరూ పిల్లులైపోయేవారు. అగ్ర తారలు సైతం ఆయన ఆగ్రహానికి ఆహుతైయేవారు. టాలీవుడ్ దర్శకుల్లో ఆయన ఫైర్ బ్రాండ్ . దర్శకత్వంలో దిట్ట. కోపం వస్తే మాత్రం ఎవరూ వేయలేరు దానికి అడ్డుకట్ట. పేరు పోలుదాసు పుల్లయ్య అనే పి.పుల్లయ్య. పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఆ దర్శకుడు .. అప్పటి  ప్రముఖ నటీమణి పి.శాంతకుమారి భర్త. ఈ దంపతులిద్దరూ ప్రేక్షకులకు ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించారు. స్టోరీ డిస్కషన్‌, షూటింగ్‌ సమయాల్లో ఆయన పనికి ఎవరైనా అడ్డం వస్తే కోపంతో కొట్టినంత పనిచేసేవారాయన. అదంతా కాసేపే! ఆ తర్వాత మనిషి చల్లబడిపోయేవారు. మాటలు పలుగురాళ్లే గాని మనసు వెన్నపూస.

‘కొడకు కోడలు, అల్లుడే మేనల్లుడు, జయభేరి, ప్రాణమిత్రులు, ప్రేమించి చూడు, మురళీ కృష్ణ, సిరి సంపదలు, శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం , కన్యాశుల్కం, అర్ధాంగి, రేచుక్క’ లాంటి అద్భుతమైన చిత్రాల్ని అందించిన పి.పుల్లయ్య.. నెల్లూరు లో జన్మించారు. ఆయనకి  చిన్నతనం నుంచీ ఫ్యామిలీ రిలేషన్స్ మీద బాగా మక్కువ ఉండడంతో … వాటినే తన కథా వస్తువులుగా చేసుకున్నారు. ప్రేమాభిమానాలు, ఆప్యాయతలే ఆయన ఇతివృత్తాలు. ఆయన  దర్శకత్వం వహించిన చాలా చిత్రాలు ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం అదే.  తన సినిమాల్లో నటీనటుల్ని తన ఆగ్రహంతో భయపెట్టైనా సరే.. వారి నుంచి  అద్భుతమైన ఔట్ పుట్ రాబట్టేవారు పుల్లయ్య. అందుకే ఆ సినిమాలన్నీ ఇప్పటికీ ఆణిముత్యాలై.. అలరారుతున్నాయి. నేడు పి.పుల్లయ్య జయంతి. ఈ సందర్భంగా ఆ యాంగ్రీ డైరెక్టర్ కు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!