ఆమె పేరు ప్రపంచ నలుమూలలా బహుప్రసిద్ధి. అందంలోనూ, అభినయంలోనూ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఉత్తమనటీమణి. బోల్డ్ పాత్రలు చేయడంలోనూ.. సినిమా రంగంలోని బోలెడన్ని శాఖల్ని సమర్ధవంతంగా నిర్వహించడంలోనూ ఆమెకు ఆమే సాటి. నటీమణిగానే కాకుండా.. మనసున్న మారాణిలా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఆమె ఎప్పుడూ ముందుంటుంది. పేరు ఏంజిలీనా జోలీ. హాలీవుడ్ చిత్రాల్ని బాగా ఇష్టపడేవారికి ఆమె ఎప్పుడూ ఏంజెలే.

బుల్లితెర చిత్రాలతో బుడిబుడి అడుగులు వేస్తూ నట ప్రయాణం ప్రారంభించిన ఏంజిలీనా జోలీ ఆ తర్వాత వెండితెరపై సహాయ పాత్రల మజిలీ దాటి కథానాయిక స్థాయికి చేరుకుంది. అంతటితోనే ఆగిపోయింటే అందరిలా ఆమె కూడా ఓ మామూలు కథానాయికగానే మిగిలిపోయేది. తన ప్రతిభకు తపనను జోడించి సాహసోపేతమైన పాత్రలు, చిత్రాలు చేస్తూ అగ్రకథానాయకులకు దీటుగా స్టార్‌డమ్‌ దక్కించుకుంది జోలీ. అలాగే దర్శకురాలిగా పలు చిత్రాల్ని తెరకెక్కించి.. అందులోనూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. అటు నటిగా, ఇటు సమాజ సేవకురాలిగా భావి తరాల నటీమణులకు మార్గదర్శకురాలు ఏంజిలీనా జోలీ. ఇక ఆమె నటిగానే కాదు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ మెప్పించింది. యానిమేషన్‌ చిత్రం షార్క్‌ టేల్‌లో చేపకు, కుండ్‌ ఫు పాండాలో ఆడపులికి గాత్రదానం చేసింది. తన గొంతుతో ఆ పాత్రలకు ప్రాణం పోసి పిల్లలను అలరించింది. నేడు ఏంజిలీనా జోలీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ ఏంజెల్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!