మెగాస్టార్ చిరంజీవికి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ‘చంటబ్బాయ్, దొంగమొగుడు, జేబుదొంగ, రౌడీ అల్లుడు‘ చిత్రాలే అందుకు అత్యుత్తమ ఉదాహరణలు. అయితే ఆయన కెరీర్ లో మరో సినిమాకూడా ఆ లిస్ట్ లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది . ఆ చిత్రం పేరు ‘అందరివాడు’. కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో చెయితిరిగిన శ్రీనువైట్ల .. తన కెరీర్ బిగినింగ్ లో తెరకెక్కించిన ఈ సినిమా .. అప్పటి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. ఈ సినిమా 2005 లో విడుదలైంది. 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ‘అందరివాడు’ చిత్రంలో మెగాస్టార్ తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు. నిజానికి ఈ సినిమాలోని గోవింద రాజులు అనే తండ్రి పాత్రలోనే బోలెడంత ఎనర్జీ, కామెడీ, అల్లరి ఉంటుంది. ఆ పాత్రను చిరు అవలీలగా పోషించి మెప్పించారు. కొడుకు సిద్ధార్ధ పాత్ర.. ఆద్యంతం సీరియస్ గానూ, తండ్రి అంటే ప్రాణం పెట్టేదిగానూ ఉంటుంది. ఇక గోవింద రాజులు పాత్రకు జోడీగా టబు నటించగా.. కొడుకు పాత్ర సరసన రిమీసేన్ కథానాయికగా నటించింది. ఒక మగబిడ్డకు జన్మనిచ్చి.. భార్యను పోగొట్టుకొన్న గోవిందరాజులు.. తన కొడుకే ప్రాణంగా జీవిస్తూ.. మరో పెళ్ళిమాటే తలపెట్టడు. అప్పటినుంచీ తన భార్యను తలచుకుంటూ… తాగుడుకు అలవాటు పడి.. మేస్త్రీగా పనిచేస్తూ.. జులాయిగా తిరుగుతుంటాడు. తన తండ్రికి మళ్ళీ పెళ్లి చేస్తే కాస్తంత బాధ్యతగా ఉంటాడని భావించిన సిద్ధార్ధ .. తన తండ్రికి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత సిధార్ధకి కూడా పెళ్లవడంతో.. గోవిందరాజులు, సిద్ధార్ధ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు .. కథను మరో మలుపు తిప్పుతాయి. మొత్తానికి మెగాస్టార్ కెరీర్ లో అందరివాడు ప్రత్యేకమైన చిత్రమనే చెప్పాలి.