యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ.. రంగస్థలంలో రంగమ్మత్తగా ఆడియెన్స్ మదిలో స్థిరపడిపోయింది. అది బ్రేక్ చేసే పాత్ర పెదకాపులో చేసానంటోంది అనసూయ. ఈ సినిమా సెప్టెంబర్ 29న రిలీజ్ సందర్భంగా పాత్రికేయులతో ముచ్చటించింది అనసూయ. ఆ విశేషాలు…
“ఇప్పుడే ఆ పాత్ర పేరు, స్వభావం గురించి పూర్తిగా చెప్పకూడదు. ప్రేక్షకులు పెదకాపు వరల్డ్ తో ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. సినిమా చూసిన తర్వాత నా పాత్ర ఇంకా ఇంపాక్ట్ ఫుల్ గా వుంటుంది. ఇందులో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా నచ్చింది. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ పేరుతోనే పిలుస్తారనే నమ్మకం వుంది.
రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర ఒక బార్ ని సెట్ చేసింది. ఐతే నేను మాత్రం విభిన్నమైన పాత్రలు చేయడానికి నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. ‘విమానం’లో సుమతి పాత్రలో విభిన్నంగా కనిపించాను. ఇప్పుడు పెదకాపులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా వుంటుంది. పెదకాపు చాలా రా ఫిల్మ్. నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా వున్నాయి.
ఛోటా గారు ఫోన్ చేశారు. ‘’నీకొక ఫోన్ వస్తుంది. ఆ పాత్ర చేయమని చెప్పను కానీ కన్సిడర్ చేయ్’’అని చెప్పారు. శ్రీకాంత్ గారు ఈ కథ చెప్పిన తర్వాత తప్పకుండా ఇలాంటి మంచి సినిమాలో భాగం కావాలని నిర్ణయించుకున్నాను.
శ్రీకాంత్ గారంటే .. సీతమ్మ వాకిట్లో, బ్రహ్మోత్సవం.. ఇలాంటి హోమ్లీ ఇంప్రెషన్ వుంటుంది. అలాంటి శ్రీకాంత్ గారు పెదకాపు లాంటి కథ చెప్పినపుడు షాక్ అయ్యా. దర్శకుడిగా ఆయనకి ఇది చాలా డిఫరెంట్ ట్రాన్స్ ఫర్మేషన్.
పెదకాపులో ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ప్రతి పాత్రకు ఒక మేకోవర్ వుంది. మేకోవర్ లో ఎన్ని రకాలు ఉంటాయో ఈ సినిమా చేసేటప్పుడు నేర్చుకున్నాను. ఈ సినిమా చాలా మంచి అనుభవం.
అన్ని రకాల పాత్రలు చేస్తాను. అమ్మమ్మ పాత్ర కూడా చేస్తాను. ఐతే ఆ పాత్ర చూసిన తర్వాత అమ్మమ్మ గురించి మాట్లాడుకునేలా వుండాలి” అంటూ తన కెరీర్ కు సంబంధించి అన్ని విషయాలు కూలంకుశంగా చర్చించారు అనసూయ.