కొన్ని సినిమాలు చరిత్ర సృష్టిస్తాయి. మరి కొన్ని సినిమాలు చరిత్రలో చెరగని గురుతుగా మిగిలిపోతాయి. ఇంకొన్ని సినిమాలు మాత్రం చరిత్రగా మారిపోతాయి. అలాంటి ఓ గొప్ప చిత్రం అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘అనార్కలి’. అంజలీ పిక్చర్స్ బ్యానర్ పై అంజలీదేవి టైటిల్ రోల్ పోషించి..నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు వేదాంతం రాఘవయ్య. 1955 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అక్కినేని కెరీర్ కు గట్టి పునాదులు వేసిన చిత్రాల్లో అనార్కలి కూడా ఒకటి.

అక్బర్ పాదుషాగా ఎస్వీ రంగారావు, సలీమ్ గా ఏయన్నార్, అక్బర్ భార్య జోధాబాయ్ గా కన్నాంబ తమదైన బాణీ పలికించారు… 1953లో ‘అనార్కలి’ పేరుతో హిందీలో బీనారాయ్, ప్రదీప్ కుమార్ జంటగా రూపొందిన చిత్రం విజయఢంకా మోగించింది… ఆ చిత్రానికి సి.రామచంద్ర సమకూర్చిన సంగీతం ఈ నాటికీ సంగీతప్రియులను అలరిస్తూనే ఉంది… ఆ సినిమా ఆదారంగానే తెలుగు ‘అనార్కలి’ కూడా వెలుగు చూసింది. పారసీ, ఉర్దూ మిళితమైన భాషలో అనార్కలి, అక్బర్, సలీమ్ సంభాషించేవారని ప్రతీతి… అందుకు తగ్గట్టుగా ఈ ‘అనార్కలి’లో సంభాషణలను, పాటలను మలిచారు సముద్రాల రాఘవాచార్య. ఇక ‘అనార్కలి’ గాథ అంతకుముందు కూడా కొన్నిసార్లు హిందీ, ఉర్దూ భాషల్లో రూపొంది జనాన్ని అలరించింది… అఖండ భారతదేశాన్ని జనరంజకంగా పాలించిన అక్బర్ చక్రవర్తి, తన తనయుడు సలీమ్ ప్రేమ విషయంలో మాత్రం రాజు-పేద తేడాలు చూపించాడు… రాకుమారుడు సలీమ్ ను ప్రేమించిన అనార్కలి ఓ పేదింటి బాల కావడం మూలాన ఆమెను రాజద్రోహిగా నిర్ణయించి చెరసాల పాలు చేశాడు… తరువాత సలీమ్ ఆమెను మరచిపోయేలా సమాధి చేశాడు… ఈ కథ లోకవిదితం… ఈ కథతోనే ‘అనార్కలి’ తెరకెక్కింది… ’అనార్కలి’ గాథలు పలుమార్లు తెరకెక్కినా, వాటిలో అంజలీ పిక్చర్స్ వారి ‘అనార్కలి’ తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది…అరవై ఐదు  ఏళ్ల క్రితం తెలుగువారిని అలరించిన ఈ చిత్రంలోని పాటలు ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉండడం విశేషం…

   

Leave a comment

error: Content is protected !!