ఆయన పాట తేనెల ఊట. శ్రావ్యత, శ్రుతి పక్వత, రాగయుక్త లయబద్ధంగా పాడడం వల్లనేమో తెలియదు కానీ.. ఆయన్ను అప్పట్లో  అందరూ మెలోడీ రాజా అనేవారు. ఆయన పేరు ఏ.యం.రాజా. అసలు పేరు  అయిమల మన్మథరాజు రాజా . రాజా గళంలో ఒక వినూత్నమయిన సౌకుమార్యం, మార్దవం, మాధుర్యం ఉంటుంది. తలత్, రఫీల జాడలు అక్కడక్కడ కనబడినా రాజా కంఠస్వరం ప్రత్యేకమైనది. ఎక్కడ వినబడినా గుర్తించడం కష్టం కాదు. కాని అనుకరించడం మాత్రం సులభం కాదు. ఆ ప్రత్యేకత వల్లనే సినిమారంగంలో రాజా మెల్లమెల్లగా పైకెదిగారు. ఆ కాలపు సంగీత దర్శకులందరు శ్రుతి చేసిన పాటలను అన్ని దక్షిణ భారత భాషలలో, హిందీలో పాడసాగారు రాజా. 

తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి దర్శకత్వంలో సంసారం చిత్రంలో  సంసారం అనే పాట రాజా పాడిన మొట్టమొదటి సినిమా పాట.  అన్ని భాషలలో పాడుతున్నా, తెలుగు తమిళ సినిమాలలోనే రాజా ఎక్కువగా పాడేవారు. ఆ సమయంలోనే ఎం. జీ. రామచంద్రన్ నటించిన ‘జెనోవా’ చిత్ర నిర్మాణ సమయంలో పీ. జీ. కృష్ణవేణిని చూడడం తటస్థించింది. ఇద్దరూ కలిసి సినిమాలలో యుగళ గీతాలు పాడేవారు. అలా ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ అలా పెరిగి పాటలలోనే కాకుండా జీవితంలో కూడా భాగస్వాములయ్యారు. ఏ.యం. రాజా దక్షిణాది సినీ సంగీత చరిత్రలో మరువలేని  గాయకుడిగా చెరగని ముద్ర వేశారు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చారు. నేడు ఏ.యం.రాజా జయంతి. ఈ సందర్భంగా ఆ మెలోడీ రాజాకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!