నేడే ఈ నాడే.. ప్రజా యుద్ధ సంరంభం.. మేడే ఈ నాడే ప్రళయశక్తి సంచలనం. అలాంటి ఓ సంచలనానికి తెరదీసింది తెలుగు ఇండస్ట్రీ. సరిగ్గా 47 ఏళ్ళ క్రితం టాలీవుడ్ లో మేడే రోజున విడుదలై సంచలనం సృష్టించిన విప్లవాత్మక చిత్రం సూపర్ స్టార్ కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’. బ్రిటీష్ వారి గుండెల్లో విప్లవాగ్ని రగిలించిన ఆ అగ్ని .. తెలుగు సినిమా రికార్డుల్ని సైతం తిరగరాసింది. తెలుగులో మొట్టమొదటి కలర్ స్కోప్ చిత్రంగా తెరకెక్కిన అల్లూరి సీతారామరాజు .. కృష్ణ కెరీర్ లోనే ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. ఆయన నటించిన వందవ చిత్రం అల్లూరి సీతారామరాజు. ఈ సినిమా షూటింగ్ ఒక మహత్తరమైన కార్యంగా , ఈ సినిమా ఒక విప్లవాత్మక కావ్యంగా రూపొందడానికి రచయిత త్రిపురనేని మహారథి కృషి ఎంతైనా ఉంది.
మహారధి సంభాషణలను ఏరోజుకారోజే రాసేవారు. అందరికన్నా ముందే లేచి, చన్నీటి స్నానం చేసి, ధ్యానం పూర్తి కావించి సంభాషణలు రాసేందుకు ఉపక్రమించేవారు. మన్యంలో షూటింగు జరిగినన్ని రోజులు మహారథికి ఏకభుక్తమే. పతాక సన్నివేశానికి అవసరమైన సంభాషణలు రాసేందుకు ఒకరోజు మహారథి యూనిట్ సభ్యులకి దూరంగా వెళ్లి సాయంకాలం దాకా రాలేదు. ఆరోజే సీతారామరాజే తనని ఆవహించి అద్భుతమైన డైలాగులు రాయించాడని మహారథి అనేవారు. అంతవరకూ కృష్ణ నటించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, అల్లూరి సీతారామరాజు చిత్రమొక్కటీ ఒక ఎత్తు. సంభాషణలు పలికే తీరు, హావబావాలు ప్రదర్శించే విదానం, ఆహార్యం వంటి విషయాల్లో కృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏకబిగిన ముఫ్పై కాల్షీట్లతో పనిచేశారు. దర్శకుడు వి.రామచంద్రరావు సగం సినిమా చిత్రీకరించి ..హృద్రోగంతో మరణిస్తే .. మిగతా సగాన్ని యాక్షన్ చిత్రాల దర్శకుడు కె.యస్.ఆర్.దాస్ పూర్తి చేశారు. సినిమా విడుదలై.. ఘనవిజయాన్ని సాధించి రజతోత్సవాన్ని, 17 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకుంది. రిపీట్ రన్లో కూడా వందరోజులు ఆడిన మాయాబజార్ దేవదాసు వంటి అతి తక్కువ సినిమాల సరసన అల్లూరి సీతారామరాజు చోటు సంపాదించింది. విజయవాడ నగరంలో ఏకంగా నాలుగు థియేటర్లలో ఒకేరోజు విడుదలై ఈ సినిమా రికార్డు సృష్టించింది అల్లూరి సీతారామరాజు. కాంతారావు, పేకేటి, రావుగోపాలరావు, చంద్రమోహన్, త్యాగరాజు, అల్లురామలింగయ్య, కె.వి. చలం, విజయనిర్మల, మంజుల, పండరీబాయి వంటి హేమాహేమీలు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగు చలనచిత్ర మాలికలో ఒక మణిపూస. పేదల పాలిటి పెన్నిధిగా, విప్లవానికి ప్రవక్తగా నిలిచిన సీతారామరాజు చరిత్రను సినిమాగా మలిచిన సూపర్ స్టార్ కృష్ణ జన్మ ధన్యం. ఏదేమైనా అప్పటికీ ఇప్పటికీ మేడే బ్లాక్ బస్టర్ అంటే అల్లూరి సీతారామరాజే .