తాత నటనని, తండ్రి సెన్సాఫ్ హ్యూమర్ ను, అన్న ఎనర్జీని చిన్న తనం నుంచీ దగ్గరనుంచి చూసిన కుర్రోడు అతడు. అందుకే అతడు ఎనర్జీకి పర్యాయపదం. అంతులేని అల్లరికి చిరునామా.. హైపర్ యాక్టివిటీకి కేరాఫ్ అడ్రెస్.. పేరు అల్లు శిరీష్. ఇప్పుడిప్పుడే నటనలోని మెలకువలు నేర్చుకుంటూ… తన కంటూ ఒక శైలిని ఏర్పరుచుకున్న హీరో అతడు. అతగాడి గురించి తెలిసినవారు అల్లరి శిరీష్ అంటారు.
బాలనటుడిగా ‘ప్రతిబంద్’ హిందీ చిత్రం తో మెగాస్టార్ తో పాటు తెరకు పరిచయ్యాడు. 1995లో ‘మాయాబజార్’ అనే తమిళ చిత్రంలోనూ బాలనటుడిగా మెరిశాడు. ‘గౌరవం’, ‘కొత్తజంట’ చిత్రాలు పర్వాలేదనిపించాయి. ‘శ్రీరస్తు శుభమస్తు’తో తొలి విజయాన్ని సొంతం చేసుకొన్నాడు. ‘ఒక్క క్షణం’తో నటుడిగా మరింత రాటుదేలాడు. ‘1971: బియాండ్ బార్డర్స్’ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. అందులో మోహన్‌లాల్‌తో కలిసి నటించి శిరీష్ మంచి ప్రతిభని కనబరిచాడు. శిరీష్ కేవలం నటనపైనా కాకుండా నిర్మాణ వ్యవహారాల్లోనూ పాలు పంచుకొంటుంటారు. ‘గజిని’ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. బుల్లితెరతోనూ శిరీష్‌కి అనుబంధం ఉంది. ఐఫా ఉత్సవం, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకుల్ని అలరించాడు. నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.