అప్పమ్.. బప్పమ్.. ఆమ్యామ్యా.. కనెక్షన్ .. తీతా అనే ఊతపదాలు వినపించగానే.. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆయనరూపమే కళ్ళముందు కదిలి.. పెదవులపై చిరునవ్వు చిగురిస్తుంది. ఆయన డైలాగ్స్ .. మాడ్యులేషన్ .. బాడీ లాంగ్వేజ్ .. మేనరిజమ్స్ .. అన్నీ గుర్తుకొచ్చి… నవ్వుల జల్లు కురుస్తుంది. ఆయన పేరు అల్లు రామలింగయ్య. సహజమైన నటనకి, అసాధారణమైన కామెడీ టైమింగ్ కి.. కడుపుబ్బ నవ్వించే ఆయన హావభావ విన్యాసానికి పొట్ట చెక్కలు కావాల్సిందే.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్యకు చిన్నప్పటినుంచీ నాటకాలంటే మక్కువ ఎక్కువ. ఆ ఆసక్తితోనే ఆయన సినిమాల్లో నటించేందుకు సిద్ధమయ్యారు. గరికిపాటి రాజారావు పుట్టిల్లు చిత్రంతో అందాల నటీమణి జమునతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు అల్లు. ఆ సినిమా అంతగా మెప్పించకపోయినా.. ఆ తర్వాత వద్దంటే డబ్బు, పల్లెపడుచు, మిస్సమ్మ, దొంగరాముడు లాంటి చిత్రాలతో నటుడిగానూ, హాస్యనటుడిగానూ నిలదొక్కుకున్నారు. హాస్యంతో కూడిన విలన్ పాత్రలు పోషిస్తూ మంచి మంచి విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ పేరు గడించారు. మాయాబజార్, మూగమనసులు, ముత్యాలముగ్గు, మనవూరి పాండవులు, శంకరాభరణం, అందాలరాముడు, బుద్ధిమంతుడు, ప్రేమించి చూడు వంటి సినిమాలలో రామలింగయ్యకు అద్భుతమైన పాత్రలు దొరకడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన లేని సినిమాలు బహు అరుదుగా ఉండేవి. బాపు ముత్యాల ముగ్గులో కోతిగా మారే సన్నివేశం చాలు .. అల్లు నటనా ప్రతిభ ఏ పాటిదో తెలియడానికి. రామలింగయ్య సుదీర్ఘకాలం ప్రేక్షకులను నవ్విస్తూ, హాస్యంతో కూడిన విలనీలో రాణిస్తూ, క్యారక్టర్ర్ పాత్రలు పోషిస్తూ చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1990లో ఆయనకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందజేసింది. 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘రఘుపతి వెంకయ్య’అవార్డుతో రామలింగయ్యను సత్కరించింది. నేడు అల్లు రామలింగయ్య వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.