సూపర్ స్టార్ కృష్ణ నటజీవితంలో ఎన్నో సూపర్ హిట్లున్నాయి. అందులో ‘అఖండుడు’ మూవీ ఒకటి. టైగర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. విలన్ పాత్రధారి నెల్లూరు కాంతారావు పహిల్వాన్, యస్.హెచ్. హుస్సేన్ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కు వి.రామచంద్రరావు దర్శకుడు. 1970లో విడుదలైన ఈ సినిమా సరిగ్గా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారతి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. ప్రభాకరరెడ్డి, ముక్కామల, రాజబాబు, అల్లు రామలింగయ్య, నెల్లూరు కాంతారావు , గీతాంజలి , రమాప్రభ, ఛాయాదేవి, రావుగోపాలరావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సి.యస్.రావు కథకు , త్రిపురనేని మహారథి డైలాగ్స్ రాశారు. ఇక ఈ సినిమాకి టి.చలపతిరావు సంగీతం అందించారు.
మల్టీ మిలియనీర్ అయిన ఒక వృద్ధురాలు.. ఒక ఫంక్షన్ లో డ్యాన్స్ చేస్తున్న ఒకమ్మాయి చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురు పోలికలతో ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఆ అమ్మాయిని కలిసి ఆమె ఫోటో చూపించి ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఆమె ను తన వద్దే ఉండిపొమ్మని .. తన ఆస్తి ఆమె పేరన రాయడానికి సిద్ధపడుతుంది. ఆ అమ్మాయి ఆ విషయాన్ని అంతగా పట్టించుకోదు కానీ.. వృద్ధురాలి దగ్గర ఉండడానికి ఒప్పుకుంటుంది. అయితే ఆ వృద్ధురాలి ఇంట్లో పనిచేసేవారు .. అది ఇష్టపడక .. ఆ అమ్మాయిని చంపడానికి రకరకాల పన్నాగాలు పన్నుతారు. అయితే అదే టైమ్ లో జైలు నుంచి తప్పించుకొని పారిపోయిన ఒక ఖైదీ.. అనుకోకుండా.. ఆ వృద్ధురాలి ఇంట్లోకి చేరి.. ఆ అమ్మాయిని చావునుంచి తప్పిస్తూ ఆ కుటుంబాన్ని వారి బాధనుంచి కాపాడడమే ఈ సినిమా కథ. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే ఈ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని బాగా అలరించింది.