Ajay Patnayak : టాలీవుడ్ లో మరో ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడుగా అజయ్ పట్నాయక్ అవతరించారు. ‘బహిర్భూమి’ చిత్రంతో తన సంగీతంతో ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్న ఈ యువ సంగీత దర్శకుడు తన ప్రయాణం, సినిమా ఇండస్ట్రీలో తన అనుభవాలను ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
విజయనగరం జిల్లాకు చెందిన అజయ్ పట్నాయక్ కు సంగీతం పుట్టుకతో వచ్చిన వరంలాంటిది. ఆయన కుటుంబం రోషన్ బ్యాండ్ పేరుతో ప్రసిద్ధి చెందిన సంగీత బృందాన్ని నిర్వహించేది. ఆ బ్యాండ్ కు ఉన్న ప్రాచుర్యం గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. అంతేకాదు, ఆయనకు ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కజిన్. ఇంట్లో అంతా సంగీత వాతావరణం ఉండటంతో చిన్నప్పటి నుంచి కీ బోర్డ్ నేర్చుకున్నారు.
ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చిన అజయ్, తన అన్నయ్య ఆర్.పి. పట్నాయక్ దగ్గర అసిస్టెంట్ గా చేరారు. ఆ తర్వాత మణిశర్మ గారి దగ్గర కూడా కొంతకాలం పని చేశారు. అలా చిత్ర పరిశ్రమలో తన ప్రయాణం మొదలైంది. ఇప్పటి వరకు 12 సినిమాలకు సంగీతం అందించినప్పటికీ, తనకు ఒక గుర్తింపు వచ్చే వరకు ఎలాంటి ప్రచారం చేసుకోలేదని చెప్పుకున్నారు.
ప్రస్తుతం ఆయన చేస్తున్న 13వ సినిమా ‘బహిర్భూమి’. ఈ సినిమాలోని పాటలకు మంచి ఆదరణ లభిస్తుండటం ఆయనను ఉత్సాహభరితంగా చేస్తోంది. ముఖ్యంగా హీరో నోయెల్ కు నత్తి ఉండటంతో ఆ నేపథ్యంలో ఒక పాటను కంపోజ్ చేయడం విశేషం. ఇలాంటి ప్రయత్నం ఇప్పటి వరకు ఏ భాషలోని పాటకూ చేయలేదని ఆయన చెప్పారు.
‘బహిర్భూమి’ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమా ఒక కొత్త తరహా కంటెంట్ ను మెసేజ్, ఎంటర్టైన్మెంట్ రెండూ కలిపి రూపొందించిన చిత్రమని అన్నారు. దర్శకుడు రాంప్రసాద్ మరియు నిర్మాత వేణుమాధవ్ గారి ప్యాషన్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.
నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు.
బహిర్భూమి’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న అజయ్, ప్రస్తుతం మరో మూడు చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ముఖ్యంగా లవ్ స్టోరీలకు సంగీతం ఇవ్వడం ఆయనకు ఎంతో ఇష్టం. సంగీత దర్శకుడిగా తనకు ఆర్. రెహమాన్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనను ఒకసారి కలిసిన అనుభవం గురించి కూడా పంచుకున్నారు. తన ప్రతిభతో తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప ఆస్తిగా నిలుస్తున్న అజయ్ పట్నాయక్ భవిష్యత్తులో మరెన్నో అద్భుతమైన మెలోడీలతో ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం.