Aishwarya Menon : స్పై’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మాలీవుడ్ నటి ఐశ్వర్య మీనన్ “భజే వాయు వేగం” చిత్రంతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన ఈ సినిమాకి నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 31న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్ లో ఐశ్వర్య పాల్గొని పలు విషయాలు పంచుకున్నారు.
తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన ఐశ్వర్య మీనన్ చిన్నప్పటి నుంచే కళలపై మక్కువ చూపారు. భరతనాట్యం నృత్యకారిణిగా తన ప్రయాణం ప్రారంభించి, కొన్ని కమర్షియల్ యాడ్స్‌లో నటించింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, ఐశ్వర్య నటనపై దృష్టి పెట్టింది. తెలుగులో మొదట సైన్ చేసిన సినిమా “భజే వాయు వేగం” అయినప్పటికీ, “స్పై” చిత్రం ముందుగా విడుదలైంది.
రెండు చిత్రాలలోనూ భిన్నమైన పాత్రల్లో నటించిన ఐశ్వర్య ప్రతి సినిమానూ ఇష్టపడి చేస్తానని, అన్ని విజయవంతం కావాలని కోరుకుంటానని తెలిపారు. ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉందని, వారి ఆదరణే ముఖ్యమని నమ్ముతారామె. తెలుగులో మరో సినిమాను ఖరారు చేసుకున్న ఐశ్వర్య, త్వరలోనే దాని అధికారిక ప్రకటన చేస్తానని తెలిపారు. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్న ఐశ్వర్య, మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “బజూక” సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.