ఆమె సౌందర్యం దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యను తలపిస్తుంది. ఆమె అభినయం వెండితెరకే  వన్నెలద్దుతుంది. ఆమె చక్రాల్లాంటి కళ్ళు వేలవేల భావాలను పలికిస్తాయి. ఆమె నడక హంసకే పాఠం నేర్పుతుంది. ఆమె నాట్యం పురివిప్పిన మయూరాన్నే గుర్తుకు తెస్తుంది. ఆమె పేరు శోభన. దక్షిణాది తెరకు ఆమె ఎప్పుడూ అభినయ మయూరే. ఆమె సాంప్రదాయంగా చక్కటి చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ లో గ్లామర్ ఉట్టిపడినా ఒకే తీరుతో అభినయాన్ని పండిస్తుంది. హద్దులు దాటని అందాల ప్రదర్శన,  సహజ నటన ఆమె ఆభరణాలు. ఇక ఆమె అందానికి, అభినయానికి నాట్యం కూడా తోడైతే.. ఏ భాషలోని వెండితెర అయినా సరికొత్త శోభల్ని, సొబగుల్ని ఒలికిస్తుంది.

1970, మార్చ్ 21న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది శోభన. దక్షిణాదిన అన్ని భాషా చిత్రాల్లోనూ నటించిన శోభన ఏ భాషకాభాషలో లెక్కకు మించిన అభిమానుల్ని సంపాదించుకున్నారు. 1980 నుంచి 1990 వరకూ ఎన్నో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ , హిందీ చిత్రాల్లో తనదైన శైలిలో నటించి మెప్పించిన ఆమె..  అన్ని భాషల్లోని అగ్రకథానాయకుల సరసన ఇటు గ్లామర్ ను , అటు అభినయాన్ని సమపాళ్ళలో పండించి పరవశింపచేశారు. అన్నిభాషల్లోనూ కలుపుకొని శోభన దాదాపు 230 చిత్రాల్లో నటించి నాట్య కళాభినేత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  నేడు ఆమె పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆ అభినయ మయూరికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

హ్యాపీ బర్త్ డే శోభన

 

 

Leave a comment

error: Content is protected !!