తెలుగు సినిమా లెజెండరీ డైలాగ్స్ అండ్ లిరిక్స్ రైటర్ ఆచార్య ఆత్రేయ మనస్తత్వం అందరికీ తెలుసు. ఎన్నో సినిమాలకు ఒకచేత్తో పాటల్ని, మరో చేత్తో డైలాగ్స్ ను అలవోక గా రాసిపడేసే ఆయన.. ఒక పట్టాన పెన్ను పేపర్ మీద పెట్టేవారు కాదని బాగా పేరు. అందుకే ఆయన డైలాగ్స్ రాసి జనాన్ని, తొందరగా రాయక నిర్మాతల్ని ఏడిపించుకు తిన్నారని ఆయన గురించి తెలిసినవారు చెబుతూ ఉంటారు. అలాంటి ఆత్రేయ ఆరంభ శూరత్వంతో చేసిన పని.. అప్పట్లో సినీ ఇండస్ట్రీలో పలువురిని నవ్వుకొనేలా చేసింది.
ఆత్రేయకి ఒకరోజు ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చిందట. తమిళ సినిమా రచయితలకి ఒక సంఘం ఉన్నట్టుగానే తెలుగు రచయితలకీ ఉండాలని, రచయితలందర్నీ సమావేశపరచాలని భావించారట. అయితే, ఆయన సంగతి ఆయనకీ తెలుసు, ఆయన పిలిస్తే రారని. అంచేత డి.వి.నరసరాజుని కలిసి, తన ఆలోచన చెప్పారట. నరసరాజు గారూ! సమన్వయకర్తగా నేను సమావేశం కన్వీన్ చేస్తే, ఎవరూ రారు – నా మాటమీద నమ్మకంలేక. మీరు అందరికి ఫోన్లు చేసి పిలిస్తే వస్తారు. ఉడ్‌లాండ్స్ లో ఈ ఆదివారం సాయంకాలం అని చెప్పండి. తక్కిన విషయాలు నేను చూసుకుంటాను అన్నారట ఆత్రేయ. ఆలోచన మంచిదే కదా’ అని నరసరాజు, తానే రచయితలకి ఫోన్లు చేసి రమ్మన్నారట. ఆదివారం సాయంకాలం సముద్రాల సీనియరు, జూనియరు, శ్రీశ్రీ, ఆరుద్ర, నరసరాజు, పాలగుమ్మి పద్మరాజు అలా అందరూ వచ్చారు. టిఫిన్లు తిని కాఫీలు తాగారు. సమావేశం లక్ష్యం చెప్పమన్నారు. బాగుందనుకొన్నారు. రాత్రి 7:30 అయింది. కానీ అసలు మనిషి ఆత్రేయ రాలేదు.. అందరూ నవ్వుకొని వెళ్ళిపోయారట…