నటభూషణ్ శోభన్ బాబు నటించిన అత్యుత్తమ చిత్రాల్లో మల్లెపూవు ఒకటి. వి.మధుసూదనరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1978లో విడుదలై.. తెలుగులో అఖండ విజయం సాధించింది. సంగీత ప్రధానమైన ఈ సినిమాలో కథానాయికగా జయసుధ నటించగా.. మరో కీలకమైన పాత్రలో లక్ష్మి నటించి మెప్పించింది. శ్రీధర్, రావుగోపాలరావు, కె.విజయ, మాడా వెంకటేశ్వరరావు, పండరీబాయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కథానాయకుడు వేణు ఒక అద్భుతమైన కవి. అయితే అన్నదమ్ముల పోషణపై ఆధారపడే అతడు.. వారి నిరాదరణకు గురవుతాడు. దానికితోడు ప్రేమించిన అమ్మాయి కూడా వేరే వారిని పెళ్లిచేసుకొని అతడికి తీరని వేదన మిగుల్చుతుంది. దాంతో అతడు విరాగిలా మారి.. కవిత్వం రాస్తూ .. ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరుగుతూంటాడు. అలాంటి వేణు పట్ల ఎంతో ఆరాధనా భావం చూపిస్తుంది ఒక వేశ్య. మరి వేణు జీవితం ఎలా మలుపుతిరిగిందో మిగతా కథ. నిజానికి ఈ సినిమా బాలీవుడ్ మాస్టర్ డైరెక్టర్ గురుదత్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ప్యాసా చిత్రానికి రీమేక్ వెర్షన్ . ఆ సినిమా అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇందులోని పాటలు కూడా సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.