ఆయన ఎందరో అందమైన అమ్మాయిల్ని చెరబట్టాడు. హీరోయిన్స్ ను తన క్రూరమైన చేష్టలతో తిప్పలు పెట్టాడు. హీరోలకు తన విలనిజంతో వార్నింగులిచ్చాడు. అన్యాయమైన, అక్రమమైన పనులెన్నో చేసి నొటోరియస్ క్రిమినల్ అనిపించుకున్నాడు. కానీ అది రీల్ లైఫ్ లో. మరి రియల్ లైఫ్ లో .. పొట్టకూటికోసం నగరానికి వచ్చి.. లాక్ డౌన్ లో చిక్కుకున్న ఎందరినో బస్సుల ద్వారానూ, విమానాల ద్వారానూ వారి సొంత గూట్లకు పంపి మంచి మనసు చాటుకున్నాడు. అలాగే.. ఒక పేద రైతు పాలిట ఆపద్బాంధవుడై.. అతడికి దున్నుకోవడానికి ఒక ట్రాక్టెర్ నీ కొనిపెట్టాడు. ఆ ఆరడుగుల మంచితనం పేరే సోనూసూద్. ప్రస్తుతం ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఆయన దాన గుణం గురించి డిస్కషన్లు పెట్టుకుంటున్నారు. ఆయన్ని రియల్ హీరో అని వేనోళ్ళ పొగుడుతున్నారు.
సోనూ సూద్ పంజాబ్‌లోని మోగా పట్టణంలో జన్మించారు. అరుంధతిలో బొమ్మాళీ నిన్నొదలా అంటూ పశుపతి లా చెలరేగారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, పంజాబీ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. ‘సిటీ ఆఫ్ లైప్’, ‘కుంగ్‌ఫు యోగా’తో ఆంగ్లంలోనూ నటించారాయన. నటుడిగానే కాకుండా, మోడల్‌గా, నిర్మాతగా కూడా రాణించారు. 1999లో ‘కలైజ్ఞర్’, ‘నెంజిలే’ చిత్రాలతో తమిళంలోకి అడుగుపెట్టారు సోనూ. ఆ తరువాత తెలుగులో ‘హ్యాండ్సప్’ అనే చిత్రం చేశారు. 2005లో నాగార్జునతో కలిసి నటించిన ‘సూపర్’తో సోనూకి తెలుగులో మంచి గుర్తింపొచ్చింది. ఆ తరువాత ‘అతడు’, ‘అశోక్’ చిత్రాలతో అదరగొట్టారు. ‘అరుంధతి’, ‘ఆంజనేయులు’, ‘ఏక్ నిరంజన్’, ‘కందిరీగ’, ‘దూకుడు’ చిత్రాల్లో సోనూసూద్ పాత్రలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అరుంధతి’లో నటనకిగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా తెలుగులో నంది పురస్కారాన్ని అందుకొన్నారు.. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ రియల్ హీరోకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే సోనూ సూద్ …